ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఆసిఫాబాద్ మండలంలోని మానిక్‌గూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడు తూ గ్రామ పంచాయతీలు గ్రామాల అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారాలన్నారు. 2005కు ముందు నుంచి సాగు చేస్తున్న పోడు భూముల విషయంలో రైతులను ఇబ్బందులుకు గురి చేయవద్దని అధికారులకు సూచించారు. కొత్తగా అటవీ భూములను ఆక్రమిస్తూ పోడు సాగు చేయకూడదని, పోడు భూములకు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, సర్పంచ్ రాము పాల్గొన్నారు.
‘సర్’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: ‘సర్’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓడెపెల్లి గార్డెన్‌లో శనివారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఎల్‌ఏల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ గ్రామంలో బీఎల్‌ఏలు ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయించాలన్నారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ బీజేపీ సర్ ముసుగులో పెద్ద కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీఎల్‌ఏలకు పార్టీ పదవులు వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్, గ్రంథాలయం సంస్థ చైర్మన్ కామ్టే అనిల్‌కుమార్, కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వ ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, మంచిర్యాల డీసీసీ అద్యక్షుడు రఘునాథ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, బీఎల్‌ఏ ఇన్‌చార్జి రాంగోపాల్ వర్మ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కౌన్సిలర్ అబ్దుల్లా, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, గాదెవేణి మల్లేశ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కెరమెరి: మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని ధనోరా గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన వీవో భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే వ్యవస్థ బాగుపడుతుందన్నారు. ఈ సందర్భంగా సుర్దాపూర్ గ్రామానికి చెందిన పోడు రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ, ఏఎంసీ మాజీ చైర్మన్ మునీర్, మాజీ ఎంపీపీ అబ్దుల్ కలాం పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
వాంకిడి: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని కోమటిగూడలో రూ.20 లక్షలతో నిర్మించిన జీపీ భవనాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ కార్యాలయ భవనాల ద్వారా గ్రామ స్థాయిలో మెరుగైన పరిపాలన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సందర్భంగా వివిద గ్రామాల ప్రజలు వివిద సమస్యలపై వినతిపత్రాలు అందజేయగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సర్పంచ్ మోతిరాం, తదితరులు పాల్గొన్నారు.


