ఆసిఫాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం నేరుగా వంటింటిపై పడుతోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గల్ఫ్ దేశాల నుంచి పెట్రో ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో వంట నూనెలతోపాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది. మరోవైపు బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు 25 రోజుల ఇంటర్ బుకింగ్ పీరియడ్ నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీంతో 25 రోజుల వరకు రెండో సిలిండర్ బుక్ చేసుకునేందుకు వీలుండదు. వాణిజ్య సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గ్యాస్ ఏజెన్సీల నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లోని హోటళ్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన వంటనూనెలు
తాజాగా వంట నూనెల ధరలు పెరగడం భారంగా మారింది. ముఖ్యంగా సన్‌ఫ్లవర్, పామాయిల్ రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాల నుంచే సరఫరా అవుతాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో వంటనూనెలు లీటర్‌కు రూ.5 వరకు పెరిగాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత భారమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వారంతో పోలిస్తే ప్రముఖ బ్రాండ్ల వంట నూనెలు లీటర్‌కు రూ.161 నుంచి రూ.167 వరకు పెరిగాయి. జిల్లాలో అధిక శాతం ఆదివాసీ, చిన్న రైతు కూలీ కుటుంబాలు ఉండటంతో వారికి రేట్లు భారంగా మారాయి.
ఎల్పీజీ రేట్లు ౖపైపెకి
జిల్లాలో గృహ వినియోగ 14.2 కేజీల సిలిండర్ ధర రూ.60 పెరిగి రూ.982కు చేరింది. అలాగే కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ.115 పెరిగి రూ.2,144కు చేరింది. జిల్లాలో 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, సుమారు.1,40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, 28 వేలు డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 30 వేలకు పైగా ఉజ్వల కనెక్షన్లు, 23,319 దీపం కనెక్షన్లు, 69,371 జనరల్ కనెక్షన్లు, 600 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 80 వేల సబ్సిడీ సిలిండర్లు, 15 వేల ఉజ్వల సిలిండర్లు వినియోగిస్తున్నారు. దీంతో జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.1.30 కోట్ల వంట గ్యాస్ భారం పడనుండగా, అలాగే వంటనూనె ధరలతో సుమారు రూ.80 లక్షల భారం పడనుంది.
నిలకడ లేని ధరలు
గతంలో గ్యాస్ ధరలు ఏళ్లపాటు నిలకడగా ఉండేవి. రెండేళ్లుగా గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. నాలుగేళ్ల్ల క్రితం 2022 మార్చిలో జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండడర్ ధర రూ.875 ఉండగా, 2023 జనవరిలో రూ.976కు పెరిగింది. ఏప్రిల్‌లో సిలిండర్‌పై రూ.50 పెంచడంతో రూ.1019 చేరింది. జూన్‌లో మళ్లీ సిలిండర్‌పై రూ.50 పెంచడంతో రూ.1072 చేరింది. గత ఆగస్టు వరకు వంటగ్యాస్ రూ.1172 చేరగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.200 తగ్గించింది. 2024 మార్చిలో సిలిండర్‌పై మళ్లీ రూ.100 తగ్గించింది. గతేడాది కేంద్రం సిలిండర్‌పై రూ.50 పెంచడంతో జిల్లాలో సిలిండర్ ధర రూ.922కు చేరింది. తాజాగా రూ.60 పెరగడంతో రూ.982కు చేరింది.
ఆర్థికంగా భారం
పెరిగిన వంటగ్యాస్ ధర సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భా రమవుతుంది. వంటగ్యాస్‌తో పాటు వంటనూనెల ధరలు పెరిగాయి. బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం రేట్లు అదుపులో ఉంచాలి. – మౌనిక, గృహిణి, ఆసిఫాబాద్
ధరలు నియంత్రించాలి
ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, గ్యాస్, వంటనూనె ధరలను నియంత్రించాలి. పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది. పట్టణ ప్రాంతాల్లోని పేదలను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కమల, కూలీ, ఆసిఫాబాద్


