ఎన్నికల విధుల్లో ఉన్నారా?
నిర్మల్‌ఖిల్లా: ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులు దరఖాస్తు ఫారం–12కు ఎన్నికల విధుల ధ్రువీకరణపత్రాన్ని జతచేసి సంబంధిత మున్సిపాలిటీలో రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు పరిశీలించిన తర్వాత సంబంధిత రిటర్నింగ్ అధికారి ఫారం–15, 16, 17, 18 పత్రాలను దరఖాస్తుదారులకు అందిస్తారు. వీటిలో ఫారం–15 ఓటర్ వివరాలతో కూడిన సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సంతకం చేసి ఇవ్వాలి. దానిపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ అవసరం. ఫారం–16 కవర్–ఏ లో పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇది తెలుపు రంగులో ఉండి దానిపై బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య ఉంటుంది. ఫారం–17 కవర్ బిలో రిటర్నింగ్ అధికారి చిరునామా ఉంటుంది. దీనిపై ఓటరు సంతకం చేసి అందజేయాల్సి ఉంటుంది. ఫారం–18లో ఓటరు తన ఓటుహక్కును ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేసే పూర్తి వివరాలు ముద్రితమై ఉంటాయి. సంబంధిత ఎన్నికల సిబ్బంది దరఖాస్తులు సమర్పించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.


