
● శిథిలావస్థకు సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ బాలుర పాఠశా
శిథిలావస్థకు భవనాలు..
30 ఏళ్ల క్రితం సిర్పూర్(టి) బాలుర సాంఘి క సంక్షేమ గురుకులం ప్రారంభించారు. మ రమ్మతులు చేపట్టకపోవడంతో తరగతి గదులతోపాటు హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. గత నెలలో కురిసిన వర్షాలకు భవనాల పెచ్చులూడి పడ్డాయి. ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు 12 రోజులపాటు అత్యవసర సెలవులు ప్రకటించారు. భవనాల పరిస్థితిని వేసవిలో నే అంచనా వేసి నిర్ణయం తీసుకుంటే విద్యాసంవత్సరంలో మధ్యలో ఇలాంటి దుస్థితి నెలకొనే అవకాశం ఉండేది కాదు. గురుకుల భవనాల నిర్మాణాలకు రూ.6.30 కోట్ల నిధులు మంజూరైనా ఇప్పటికీ టెండర్లు పూర్తికా లేదు. భవనాలు నిర్మించేందుకు దాదాపు మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.
కౌటాల/సిర్పూర్(టి): కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. భవనాలు కూలే పరిస్థితులు ఉండటంతో గురుకులానికి మొదట సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం విద్యార్థులను ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేసి నెట్టుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇతర గురుకులాలకు విద్యార్థులు
సిర్పూర్(టి) గురుకులంలోని 497 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని ప్రస్తుతం ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేశారు. రెండు రోజులుగా విద్యార్థులను తల్లిదండ్రులు ఆయా గురుకులాలకు తీసుకెళ్తున్నారు. 5, 6, 7 తరగతుల్లోని 297 మంది విద్యార్థులను ఆసిఫాబాద్‌కు కేటాయించారు. 8వ తరగతి చదువుతున్న 66 మందిని మంచిర్యాల జిల్లా జైపూర్ సాంఘిక సంక్షేమ గురుకులం, 9, 10 తరగతి చదివే 141 మందిని బెల్లంపల్లి సీవోఈకి, సీఈసీ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం 47 మందిని కాసిపేటకు, ఎంఈవోసీ ద్వితీయ సంవత్సరం చదివే 14 మందిని కోరుట్లకు తరలించారు. వారితోపాటే అధ్యాపకులు, ఉపాధ్యాయులను కూడా సర్దుబాటు చేశారు. సోమవారం 300 మంది, మంగళవారం 150 మంది వరకు విద్యార్థులు సిర్పూర్(టి) గురుకుల పాఠశాలను ఖాళీ చేసి సర్దుబాటు చేసిన ప్రాంతాలకు వెళ్లిపోయారు.
తాత్కాలికంగా సర్దుబాటు చేశాం
భద్రత కోసం ఉన్నతాధికారుల ఆదేశాలతోపాటు తల్లిదండ్రుల ఒప్పందంతో విద్యార్థులను ఇతర ప్రాంతాల్లోని గురుకులాల్లో సర్దుబాటు చేశాం. కొన్నిరోజుల తర్వాత కాగజ్‌నగర్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుంటాం. ఉన్నతాధికారులు భవనాలు పరిశీలించిన తర్వాత అక్కడే తరగతులు కొనసాగిస్తాం. సిర్పూర్–టి గురుకులానికి పక్కా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు.
– శ్రీనివాస్, ప్రిన్సిపాల్,
సిర్పూర్(టి) గురుకుల పాఠశాల
సరైన వసతులు కల్పించాలి
మా కుమారుడు సిర్పూర్(టి) గురుకులంలో ఏడో తరగతి చదువుతున్నాడు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఆసిఫాబాద్‌కు తరలించారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇతర ప్రాంతాలకు తరలించడం ఇబ్బందికరంగా ఉంది. పక్కా భవనాలు నిర్మించేవరకు అన్ని వసతులు ఉన్న అద్దె భవనాల్లో నిర్వహించాలి. కౌటాల మండలం విజయనగర్ ఎయిడెడ్ పాఠశాలను సైతం ఉన్నతాధికారులు పరిశీలించాలి.
– అంకులు, విద్యార్థి తండ్రి, కౌటాల