బీసీ గురుకుల ‘సీవోఈ’
● ఉమ్మడి జిల్లాకు ఒకటి మంజూరు ● ఆదిలాబాద్ పరిధిలో లక్సెట్టిపేటలో బాలుర కళాశాల ● ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి..
ఆదిలాబాద్‌రూరల్: బీసీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్లమాధ్యమంలో నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో మహాత్మజ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో 11 పాఠశాలలను ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని ఇంటర్మీడియెట్ వరకు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 22కు చేరింది. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్సెట్టిపేటలో బీసీ సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) సైతం అందుబాటులోకి రానుంది. ఇక్కడి విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్‌కు ధీటుగా ఫలితాలు సాధిస్తుండడంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది.
శిక్షణ.. ఎంపిక
ఇందులో ఇంటర్మీడియెట్‌తో పాటు జేఈఈ మెయిన్స్, నీట్, ఐఐటీ తదితర పోటీ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీటిలో ప్రవేశాలకు గాను 75 శాతం బీసీ విద్యార్థులకు, 25 శాతం ఇతరులకు కేటాయించనున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదివిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
జిల్లాలో 22 బీసీ గురుకులాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2017లో 11 మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలను ప్రారంభించగా ప్రస్తుతం వీటి సంఖ్య 22కు చేరింది. ఇందులో 11 బాలికలు, 11 బాలుర కళాశాలలు ఉన్నా యి. వీటిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గాను శనివారం వరకు దరఖాస్తులను ఆహ్వానించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచి..
ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను యూని ట్‌గా తీసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు సీవోఈలు అందుబాటులో కి రానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బాలుర సీవోఈ ప్రారంభం కానుంది. అలాగే నిజామాబాద్‌లో బాలికల సీవోఈ ఏర్పాటు కానుంది. ఒక్కో దానిలో 160 (ఎంపీసీ 80, బైపీసీ 80) సీట్లు అందుబాటులో ఉంటాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
– ఎస్ శ్రీధర్,
మహాత్మాజ్యోతి బాపూలే గురుకులాల ఆర్‌సీవో
ఒక్కో సీవోఈలో 160 సీట్లు ..
కొన్నేళ్లుగా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో సీవోఈలు కొనసాగుతున్నాయి. బీసీ సంక్షేమశాఖ పరిధిలోనూ హైదరాబాద్‌లో బాలురు, బాలికల సీవోఈలు ఒక్కోటి చొప్పున నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 10 సీవోలను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అందుబాటులోకి తెస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకుని రెండు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బాలుర, నిజామాబాద్‌లో బాలికల సీవోఈలను ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో సీవోఈలో ఎంపీసీలో 80సీట్లు, బైపీసీలో 80 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
బీసీ గురుకుల ‘సీవోఈ’


