వలస బాట..
ప్రాణహిత నదిలో నాటుపడవ ద్వారా చేపలు పడుతున్న మత్స్యకారులు
మహారాష్ట్రలోని దేవలమర్రి గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు తోకల లక్ష్మి. తన కుటుంబంతోపాటు ప్రా ణహిత తీరానికి వలస వచ్చింది. ఇక్కడే చిన్న గు డారం ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి నాటుపడవలతో నదిలోకి వెళ్లి చేపలు పడుతున్నారు. పట్టిన చేపలను పరిసర ప్రాంతాల్లో విక్రయించి జీవనం సాగిస్తున్నారు.. ఇలా అనేక కుటుంబాలు ప్రాణహిత నదిలో చేపలు పడుతూ ఉపాధి పొందుతున్నాయి.
పెంచికల్‌పేట్(సిర్పూర్): మత్స్యకార కుటుంబాలు దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్నాయి. చేపల వేట కోసం ప్రాణహిత నదిలో గుడారాలు వేసుకుని కటిక చీకటిలో పిల్లపాపలతో కాలం వెల్లదీస్తున్నాయి. ఏళ్లుగా వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలోని సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాలను ఆనుకుని ప్రాణహిత నది ప్రవహిస్తుంది. తలాయి నుంచి మొదలుకుని మురళీగూడ వరకు పలు ప్రాంతాల్లో చేపల వేటే ప్రధానంగా దాదాపు 60 గంగపుత్రుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. లోనవెల్లి, తుమ్మిడిహెట్టి, బెజ్జూర్, తలాయి, మురళీగూడ గ్రామాలకు చెందిన మత్స్యకారులతోపాటు మహారాష్ట్రలోని దేవలమర్రి, వట్రా గ్రామాలకు చెందిన మత్స్యకారుల కుటుంబాలు నది తీరంలోనే ఉంటూ చేపలు పడుతున్నారు.
ఆరునెలలు నదిలోనే..
ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలో పదుల సంఖ్యలో గంగపుత్రుల కుటుంబాలు తాత్కాలికంగా గుడారాలను ఏర్పాటు చేసుకున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత అక్టోబర్ చివరి నుంచి జూన్ వరకు నదిలో ఇసుక మేటలపై జీవనం సాగిస్తారు. నాటు పడవల ద్వారా జెల్లా, బొచ్చె తదితర చేపలతోపాటు రొయ్యల వేట సాగిస్తున్నారు. పట్టిన చేపలు, రొయ్యలను పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని అహెరితోపాటు జిల్లాలోని బెజ్జూర్, కౌటాల, పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి మండల కేంద్రాల్లో విక్రయిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
నాటుపడవలతో ప్రమాదం
ప్రాణహితలో నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది. అకాల వర్షాలు కురిసిన సమయంలో నదిలో నీటిప్రవాహం పెరుగుతుంది. నాటు పడవల ద్వారా లోతైన ప్రాంతాలకు వేటకు వెళ్తే నిత్యం ప్రమాదం పొంచి ఉంటుంది. అధునాతన వలలు లేక పాత వాటిని వినియోగిస్తుండటంతో పెద్దచేపలు చిక్కినప్పుడు వలలు తెగిపోతున్నాయి. అలాగే నదిలో పట్టిన చేపలను కొందరు మహారాష్ట్రలోని అహెరి, బెజ్జూర్, తలాయి గ్రామాల్లోని వ్యాపారులకు కిలో రూ.80 నుంచి రూ.100 విక్రయిస్తున్నారు. బయట మార్కెట్‌లో చేపల ధర కిలో రూ.150 కంటే ఎక్కువ పలుకుతున్నా మార్కెటింగ్ లేక శ్రమను తక్కువకే అమ్ముకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన వలలు, వాహనాలు అందించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.
ఆరునెలలు నదిలోనే..
తరతరాలుగా ప్రాణహిత నదిలోనే చేపల వేట సాగిస్తున్నాం. సుమారు ఆరు నెలలు నదిలోనే ఉంటాం. చేపలు వలకు చిక్కకున్నా వృత్తిని వదులుకోలేకపోతున్నాం. మార్కెటింగ్ లేక అనేక అవస్థలు పడుతున్నాం. అధికారులు స్పందించి మార్కెట్ ధరకు చేపలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
– పేదం ముత్తుబాయి, దేవలమర్రి
ప్రాణహిత నదిలో మత్స్యకారుల దుర్భర జీవితం
ఆరు నెలలపాటు అక్కడే నివాసం
కటిక చీకటిలో కాలం వెల్లదీస్తున్న వైనం
మార్కెటింగ్ సౌకర్యం లేక నష్టాలు
ఉదయం, సాయంత్రం వేటకు..
చేపల వేటతో గతంలో ఆశించిన ఆదాయం ఉండేది. క్రమంగా నాటు పడవల ద్వారా చేపల వేట భారంగా మారింది. ఉదయం, సాయంత్రం వేటకు వెళ్లి చేపలు పడుతుంటారు. ప్రతిరోజూ పట్టిన 5 నుంచి 10 కిలోల చేపలను ఆయా కుటుంబాలకు చెందిన మహిళలు గ్రా మాల్లో విక్రయిస్తుంటారు. ఉపాధి కోసం ఉన్న ఊరును వదిలి కష్టపడుతూ కడుపు నింపుకుంటున్నామని వాపోతున్నారు. నది పరీవాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెలపై పిల్లపాపలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాకు అవకాశం లేకపోవడంతో దీపాల వెలుగుల్లోనే జీవనం సాగిస్తున్నారు. దీనికి తోడు ఈదురుగాలులు, అకాల వర్షాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులు వెల్లదీస్తున్నారు.
చేపల వేట
చేపల వేట
చేపల వేట


