గురుకులం.. భవిత పదిలం
ఆసిఫాబాద్‌రూరల్: ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం గురుకులాలను తీర్చిదిద్దుతోంది. పేద విద్యార్థుల ఉన్నతే లక్ష్యంగా, ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన బోధన అందుతోంది. 2026– 27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో నూతన ప్రవేశాలు, అలాగే 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
14 గురుకులాలు.. భారీగా సీట్లు
జిల్లావ్యాప్తంగా 14 గురుకుల పాఠశాలలు ఉన్నా యి. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలు 5, సాంఘిక సంక్షేమ గురుకులాలు 5, మైనారిటీ గురుకులాలు 4 ఉన్నాయి. ఇందులో బాలికల కోసం 8, బాలుర కోసం 6 గురుకులాలు కేటాయించారు. ఒక్కో గురుకులంలో ఐదో తరగతికి 80 సీట్ల చొ ప్పున.. జిల్లాలోని మొత్తం 14 గురుకులాల్లో 1,120 మంది విద్యార్థులు ప్రవేశం పొందే వీలుంది. వీటితోపాటు 6 నుంచి 9వ తరగతి వరకు వివిధ కారణాలతో ఖాళీ అయిన(బ్యాక్‌లాగ్) సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉండనుంది.
అర్హతలు.. పరీక్ష విధానం
ఐదో తరగతిలో ప్రవేశానికి 2026 ఆగస్టు 31 నాటికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 13 ఏళ్లు, బీసీ/ఇతర వర్గా ల వారికి 11 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 ల క్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు మించొద్దు. వంద మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీ క్ష నిర్వహిస్తారు. పరీక్షకు రెండు గంటల సమయం కేటాయిస్తారు. తెలుగులో 20 మార్కులు, ఇంగ్లిష్ లో 25, గణితంలో 25, పర్యావరణ విజ్ఞానం(ఈవీఎస్)కు 20, మెంటల్ ఎబిలిటీకి 10 మార్కులు ఉంటాయి. విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో పరీక్ష రాసే వెసులుబాటు ఉంటుంది.
22న ఎంట్రెన్స్ ఎగ్జామ్
అర్హులైన విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి బోనఫైడ్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నాలుగో తరగతి చదువుతున్న వారు 5వ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ఈ నెల 21లోగా అధికారిక వెబ్‌సైట్ https://tg cet.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవా లి. పరీక్ష రుసుం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 22న అర్హత పరీక్ష నిర్వహిస్తారు.


