సమాచారం తెలిసేదెలా? | Sakshi
Sakshi News home page

సమాచారం తెలిసేదెలా?

Published Mon, May 27 2024 3:35 PM

సమాచారం తెలిసేదెలా?

● నిలిచిన ఉపాధి కూలీల పే స్లిప్‌లు ● తెలియని మస్టర్లు, వేతన వివరాలు ● జన్‌మన్‌రేగా యాప్‌పై అవగాహనేది?

తిర్యాణి: ఉపాధిహామీ పథకంలో మార్పుల కారణంగా కూలీలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఒక్కో కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తుండగా నిరుపేద కూలీలకు ఉపాధి లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1.23 లక్షల జాబ్‌ కార్డులుండగా 2.47 లక్షల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. జిల్లాలో 15 మండలాలుండగా ఒకటి, రెండు మండలాలు మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో ఉపాఽధిహామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న కూలీలకు వేతన స్లిప్‌లు ఇవ్వడం లేదు. రెండేళ్ల క్రితం వరకు కూలీలకు సక్రమంగా పే స్లిప్‌లు అందజేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో నిలిపివేశారు. ప్రధానంగా పే స్లిప్‌లో కూలీ పేరు, పని ప్రదేశం, మస్టర్ల సంఖ్య, మిగతా పని దినాల సంఖ్య, రోజు కూలి తదితర వివరాలుంటాయి. దీంతో ఒక్కో కూలీ ఏ పని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారు.. ఎంత వేతనం వస్తుంది.. అనేది సృష్టంగా అర్థమయ్యేది. ప్రస్తుతం స్లిప్‌లు పంపిణీ చేయకపోవడంతో కూలీకి వారానికి ఎంత వేతనం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతీ వారం వేతన వివరాలు కూలీలకు తెలియడం ద్వారా ఒక వారం తక్కువ పడితే, మరో వారం నుంచి గరిష్ట వేతనం కోసం అధికంగా పని చేసే అవకాశముంది.

కూలీలు నష్టపోయే అవకాశం

సాధారణంగా ఉపాధిహామీ పనులకు సంబంఽధించిన డబ్బులు పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌ ఖాతాల ద్వారా చెల్లిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ సగానికి పైగా పోస్టాఫీస్‌ ఖాతాల్లోనే డబ్బులు జమవుతున్నాయి. అయితే సదరు కూలీలకు సంబంధించి దాదాపు ఒకేసారి రెండు లేదా అంతకన్నా ఎక్కువ వారాలకు సంబంధించిన చెల్లింపులు చేస్తుంటారు. అయితే జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా నిరక్ష్యరాసులైన కూలీలుండడంతో తమ ఖాతాల్లో ఎంత నగదు జమ అయ్యిందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో బీపీఎంలు నగదు విత్‌ డ్రా సమయంలో గతంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఒకవేళ కూలీల బ్యాంక్‌ ఖాతాల్లో వేతన డబ్బులు జమ అయినప్పటికీ దగ్గరలో ఏటీఎం సెంటర్లు అందుబాటులో ఉండని కారణంగా మినీ ఏటీఎం నిర్వాహకులను ఆశ్రయించి నగదు విత్‌డ్రా చేసుకునే సమయంలోనూ అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఉపాధిహామీ కూలీలకు సంబంధించిన వేతన వివరాలను జన్‌మన్‌రేగా యాప్‌లో పొందుపరుస్తున్నప్పటికీ ఆ యాప్‌పై క్షేత్ర స్థాయిలో కూలీలకు అవగాహన లేకపోవడంతో అది ఉపయోగపడటం లేదు. ఉపాధిహామీ సిబ్బంది జన్‌మన్‌రేగా యాప్‌పై అవగాహన కల్పించాలని, వేతన స్లిప్‌లు ఇవ్వాలని కూలీలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement