
సిర్పూర్(టి) ఎంపీపీగా ఈర్త సత్యనారాయణ
సిర్పూర్(టి): సిర్పూర్(టి) మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక కోసం శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ ఆర్డీవో సురేశ్ సమక్షంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించగా.. సిర్పూర్(టి) మండల పరిషత్ అధ్యక్షుడిగా వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణను ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆర్డీవో ఈర్త సత్యనారాయణకు ఎన్నిక ధ్రువపత్రం అందజేశారు. కాగా. గత ఎంపీపీ చునార్కర్ సువర్ణపై ఫిబ్రవరిలో ఏడుగురు ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం అందించిన విషయం తెలిసిందే. ఆర్డీవో సమక్షంలో మార్చి 30న చునార్కర్ సువర్ణపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాసం నెగ్గడంతో ఎంపీపీగా సువర్ణ తన పదవిని కోల్పోయారు. అప్పటి నుంచి వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపీపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సోహెల్ అహ్మద్, మంగీలాల్, కారం శైలజ, ఎల్ములే సరిత, తాహెరా బేగం తదితరులు పాల్గొన్నారు.