పోలీసు శాఖ సీరియస్..
నడిరోడ్డుపై బర్త్‌డే వేడుకలు,
బైక్‌లతో స్టంట్లు
తల్వార్లు తిప్పుతూ
విన్యాసాలతో వీడియోలు
ఆపై సోషల్ మీడియాలో
పోస్ట్ చేస్తున్న యువత
కట్టడి చేసేలా కఠిన చర్యలకు
ఉపక్రమించిన పోలీసు శాఖ
గీత దాటితే
హద్దులు దాటుతూ..
ఇటీవల జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో యువత హద్దులు దాటుతోంది. గుంపుగా చేరి విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. వేడుక ఏదైనా తల్వార్లు, బైక్‌లతో విన్యాసాలు చేస్తూ, ప్రశ్నించిన వారిపై ఎదురు దాడికి దిగుతున్నారు. మరికొందరు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల మత్తులో జోగుతూ దాడులకు పాల్పడుతున్నారు.
చెవులు చిల్లులు పడేలా...
యువత వికృత చేష్టలు ఇతరులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సైలెన్సర్లు మార్చిన బైక్‌లతో చెవులు చిల్లులు పడే శబ్దాలతో రాకపోకలు సాగించడం ఫ్యాషన్‌గా మారింది. అంతేకాక నడిరోడ్డుపై బైక్‌లతో విన్యాసాలతో ఇతరులు అయోమయానికి గురవుతున్నారు. ఇక పుట్టినరోజు వేడుకలను రాత్రివేళ ప్రధాన రహదారులను దిగ్బంధించి మరీ నిర్వహిస్తుండడం, మత్తులతో తల్వార్లను తిప్పుతూ విన్యాసాలు చేయడం సర్వసాధారణమైంది. కాగా, బైక్‌లతో చేసిన స్టంట్లు, పుట్టిన రోజు వేడుకల వీడియోలను పలువురు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. లైక్‌లు, వ్యూస్ కోసం ఇలా చేస్తుండగా, వీటిని చూసి ఇంకొందరు ఇదే బాట ఎంచుకుంటున్నారు.
సోషల్ మీడియా మానిటరింగ్
విపరీత పోకడలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై పోలీస్ శాఖ నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి వివరాలు సేకరించి టాస్క్‌ఫోర్స్‌కి పంపిస్తున్నారు. అనంతరం వీరిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం మొదలుపెట్టారు. అందులో మైనర్లు ఉంటే తల్లిదండ్రులను పిలిచి అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఈ తరహా కేసులు 15 వరకు నమోదయ్యాయి. బైక్‌లపై స్టంట్లు చేసిన వారిపై ఎనిమిది, తల్వార్లతో విన్యాసాలు చేసిన ఆరుగురితో పాటు రౌడీ షీటర్‌నంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఇంకొకరిపై కేసు నమోదు చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా యువత ప్రవర్తిస్తుండటంతో పోలీసులు దృష్టి సారించారు. రీల్స్ మోజులో పడి ఇష్టారీతిన ప్రవహిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా పలువురు ఆకతాయిలను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు, వారిపై ఆయుధాల చట్టం, పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేశారు. సరదా పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించినా, రోడ్లపై ఆయుధాలతో హల్‌చల్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఒకసారి కేసు నమోదైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పాస్‌పోర్ట్ జారీలో ఇబ్బంది ఎదురవుతుందని అవగాహన కల్పిస్తున్నారు. ఈమేరకు యువత నడవడికపై తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.


