కరువుతో 70, మురసుతో
551 హెక్టార్లలో ప్రభావం
సర్వేలో 2,005 మంది
బాధిత రైతుల గుర్తింపు
లోపభూయిష్టంగా సర్వే చేశారని
విమర్శలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో కరువు, మురసు తుపాన్ కారణంగా జరిగిన పంట నష్టం లెక్క తేల్చారు. వేర్వేరుగా సర్వే చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారులు మొత్తంగా 622.22 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని గుర్తించారు. ఈమేరకు 2,005 మంది బాధిత రైతులు ఉన్నారని నివేదిక సిద్ధం చేశారు.
ఎల్‌నినో ప్రభావం..
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వానాకాలం సీజన్‌లో సరైన స్థాయిలో వర్షాలు కురవక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 70.24 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని గుర్తించారు.
దెబ్బతీసిన తుపాన్
ఇటీవల సంభవించిన మురసు తుపాన్ కారణంగా 551.97 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. భారీ వర్షాలు, ఈదురు గాలులకు వరి, పత్తి, మిర్చి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి పంట నేలకొరగడమే కాక పొలాల్లో నీరు నిలిచి ధాన్యం రంగు మారి, నాణ్యత దెబ్బతింది. పత్తిలో కాయలు నేల రాలడంతో పాటు నాణ్యతపై ప్రభావం పడింది. మిర్చిలో పూత రాలి, కాయలు కుళ్లిపోయాయి. కూరగాయల పంటలు కూడా తుపాన్ కారణంగా దెబ్బతిన్నాయి.
33 శాతం పైగా నష్టం జరిగితేనే..
కరువుతో పాటు తుపాన్‌తో ప్రభావంతో దెబ్బతిన్న పంటల గుర్తింపునకు అధికారులు సర్వే చేపట్టారు. అయితే, 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగిన పంటలనే పరిగణనలోకి తీసుకున్నారు. కరువు, తుపాన్‌తో నష్టాలకు వేర్వేరుగా గుర్తించిన ఏఈఓ లు పోర్టల్ లో నమోదు చేశారు. కాగా, మండలాల వారీగా చూస్తే ఎర్రుపాలెంలో అత్యధికంగా 309.51 హెక్టార్లలో, కల్లూరులో 99.18 హెక్టార్లలో, సత్తుపల్లిలో 95.97 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. డివిజన్ల వారీగా మధిరలో 312.11 హెక్టార్లు, సత్తుపల్లిలో 230.35 హెక్టార్లలో నష్టం నమోదైంది. ఈమేరకు నివేదికను శుక్రవారం కలెక్టర్ దివాకరకు సమర్పించి, ఆయన ఆమోదంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమి షనర్‌కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.
పొంతన లేని అంచనాలు
మురసు తుపాన్ జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చేతికందే దశలో ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాది వానాకాలంలో అన్నీ కలిపి 5,09,978 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే, తుపాన్ కారణంగా 11,192 మంది రైతులకు చెందిన 23,140 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. కానీ ప్రభుత్వ ఆదేశాలతో చేపట్టిన సర్వేలో కేవలం 1,364 ఎకరాల్లో(551.97 హెక్టార్లు)నే నష్టం జరిగినట్లు నివేదిక సిద్ధం చేయడం గమనార్హం. ఇక వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. ఆ ఆనవాళ్లు ప్రస్తుతం లేకపోవడంతో సర్వే ఉద్యోగులు ఎలా లెక్క తేల్చారో అంతుపట్టడం లేదు. కరువు సర్వేలో కేవలం 173.57 ఎకరాల్లో (70.24 హెక్టార్లు)నే నష్టం జరిగినట్లు నివేదిక రూపొందించడంపై విమర్శలు వస్తున్నాయి.


