నేటి నుంచి
‘బీమా’ శిబిరాలు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించగా, అర్హుల వివరాలు నమోదు చేసేందుకు శుక్రవారం నుంచి శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు.
గ్రామాలు, వార్డుల్లో...
జిల్లాలోని ప్రతీ గ్రామం, మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో దశలవారీగా శిబిరాలు నిర్వహిస్తూ, నెలలోగా పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు రేషన్ కార్డుతో సమీపంలోని శిబిరానికి చేరుకోవాలని, కుటుంబంలో ఎవరి పేరిట బీమా చేయాలి, నామినీలు ఎందరు, వారికి చెల్లించాల్సిన శాతాలను వెల్లడిస్తే సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారని వెల్లడించారు.
ఉన్న వారు కూడా...
ఇప్పటికే రైతులు, చేనేత, బీడీ, భవన నిర్మాణ రంగ కార్మికుల బీమా పథకాలు అమలవుతున్నాయి. ఆయా వర్గాల వారు కూడా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. వివరాలన్నీ నింపాక లబ్ధిదారులకు చదివి వినిపించి, వారి అంగీకారంతోనే ఆన్లైన్ చేస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయాన అందించిన ఫోన్ నంబర్‌కు దరఖాస్తు నంబర్, ఇతర సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందే తప్ప రశీదులు జారీ చేయమని తెలిపారు. ప్రస్తుతం రేషన్ కార్డు లేని కుటుంబాల వివరాల నమోదుకు అవకాశం కల్పించలేదని కలెక్టర్ చెప్పారు. ఈవిషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆయా కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.


