మిగిలిన పనులెన్నో..
వచ్చేనెల 9న సీఎం ప్రారంభిస్తారని ప్రకటన
ఆలోగా పనులు పూర్తవుతాయా
అని సందిగ్ధత
ఖమ్మం నగర ప్రజల చిరకాల స్వప్నమైన మున్నేటిపై తీగల వంతెన నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిర్మాణం చివరి దశకు చేరిందని అధికారులు వెల్లడిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అలా జరగడం లేదు. సుమారు రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ వంతెన నిర్మాణంలో ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. పనులు మొదలై మూడేళ్లు దాటుతున్నా వానలు, వరదలకు తోడు నిధుల సమస్యతో నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. – ఖమ్మం అర్బన్
కీలకమైన మార్గం
ఖమ్మం – పాలేరు నియోజకవర్గాలకు మధ్య లింక్ రోడ్డులా మున్నేటిపై బ్రిడ్జి అవసరమవుతోంది. అంతేకాక ఖమ్మం నుంచి హైదరాబాద్, వరంగల్‌కు వెళ్లే వాహనదారులకు ఈ వంతెన కీలకంగా నిలుస్తుంది. ఖమ్మం నగరంలోకి రాకపోకలు సాగించడానికి మున్నేటిపై పాత వంతెనతో పాటు బైపాస్‌రోడ్డు ఒకటి, ప్రకాష్‌నగర్‌లో మరో బ్రిడ్జి ఉన్నాయి. ఇందులో నయాబజార్ ప్రాంతంలో ఉన్న పాత వంతెన శిథిలస్థితికి చేరడంతో తీగల వంతెన నిర్మాణానికి నిర్ణయించారు. కానీ ఏళ్ల తరబడి నిర్మాణం సాగుతుండటంతో బైపాస్‌రోడ్డులోని వంతెనపై తరచూ ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పాత వంతెనపై ప్రస్తుతం రాకపోకలు నిలిపేసి, కింది వైపు డైవర్షన్ ద్వారా అనుమతిస్తున్నారు. కానీ చిన్నపాటి వర్షం కురిసినా అక్కడ రాకపోకలకు ఆటంకం ఏర్పడి బైపాస్‌లోని వంతెనపై రద్దీ పెరుగుతోంది. అంతేకాక ప్రతీనిత్యం ఉదయం, సాయంత్రం ఈ బ్రిడ్జిపై రద్దీ పెరిగి గంటల తరబడి ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
సీఎం ప్రారంభిస్తారని...
వచ్చేనెల జిల్లా పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తారని కీలక నేతలు చెబుతున్నారు. ఆయన చేతుల మీదుగా తీగల వంతెనను ప్రారంభించాలనే భావనలో ఉన్నారు. ఆలోగా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చెబుతున్నా... బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ఇబ్బంది మారిందని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు చేసిన మేర పనులకు బిల్లులు చెల్లిస్తే మరింత వేగంగా చేపట్టే అవకాశముంటుందని చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కాంట్రాక్టు సంస్థకు కేవలం రూ.20 కోట్లే చెల్లించగా, చేసినంత మేర పనులకు సంబంధించి దాదాపు రూ.100 కోట్ల మేర ప్రభుత్వం నుంచి బకాయి ఉన్నట్లు తెలిసింది. భారీగా బిల్లు పెండింగ్‌లో ఉండటంతో మిగిలిన పనులపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మున్నేటిపై పాత వంతెన పక్కన తీగల
వంతెనకు సంబంధించి స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తయింది. అయితే, బ్రిడ్జిపై తారురోడ్డు నిర్మాణంతో పాటు అప్రోచ్ రోడ్లు, సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అంతేకాక వంతెన పైభాగంలో ఇంకొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితేనే
వంతెన అందుబాటులోకి రానుంది.
మున్నేటిపై తీగల వంతెన నిర్మాణంలో జాప్యం


