లబ్ధిదారులకు చెల్లించే బిల్లులో మినహాయింపు
● రూ.230కే సిమెంట్ బస్తా ఇచ్చేలా నిర్ణయం ● నిర్మాణాల్లో వేగం పెరిగేలా ప్రోత్సాహం ● యాప్ ద్వారా బుకింగ్‌కు అవకాశం
ఖమ్మంగాంధీచౌక్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం మరో ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈక్రమాన సిమెంట్ బస్తాను రూ.230కే అందించాలని నిర్ణయించింది. మార్కెట్‌లో కంపెనీల ఆధారంగా బస్తా ధర ప్రస్తుతం రూ.310 నుంచి రూ.360 వరకు పలుకుతోంది. అయితే, లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితులు, నిర్మాణాలు మధ్యలో ఆగిపోవద్దనే భావనతో తక్కువ ధరకు అందించాలని నిర్ణయించడంతో వారిపై బస్తాకు సగటున రూ. 150 వరకు భారం తగ్గనుంది.
ఇంటిపై రూ.30 వేల వరకు ఆదా
ఇంటి నిర్మాణం విస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వం రాయితీపై సిమెంట్ బస్తాలను లబ్ధిదారులకు సరఫరా చేస్తుంది. 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించే ఇంటికి 180 బస్తాలు, 600 చదరపు అడుగుల ఇంటికై తే 260 బస్తాల చొప్పున అందించాలని నిర్ణయించింది. ఫలితంగా లబ్ధిదారులకు ప్రస్తుత ధరతో పోలిస్తే రూ.25వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదా అవుతుంది.
యాప్‌లో బుకింగ్, బిల్లులో మినహాయింపు
ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ ద్వారా యాప్‌లో సిమెంట్ బస్తాల కోసం బుక్ చేసుకోవాలి. లేనిపక్షంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. విడతకు 50 బస్తాలు చొప్పున బుక్ చేసుకోవచ్చు. అయితే, గ్రామపంచాయతీ పరిధిలో 720 బస్తాలు బుక్ అయితేనే లారీ లోడ్ పంపిస్తారు. కాగా, లబ్ధిదారులు సిమెంట్ కోసం ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చెల్లించే నిర్మాణ బిల్లులోనే సిమెంట్ ధరను సర్దుబాటు చేస్తారు. కాగా, ఇప్పటికే లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోంది. ఇందుకోసం గ్రామ కార్యదర్శులు జారీ చేసే కూపన్‌తో ర్యాంప్‌ల వద్ద సంప్రదించాల్సి ఉంటుంది. కేవలం ట్రాక్టర్ సమకూర్చుకుంటే ఇసుక ఉచితంగా సరఫరా చేస్తారు. ఇప్పుడు సిమెంట్ కూడా తక్కువ ధరతో అందిస్తుండడంతో ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.
రెండు విడతల్లో 18వేలకు పైగా..
జిల్లాకు ఇప్పటివరకు రెండు విడతల్లో 18,326 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి దశలో 16,818, రెండో దశలో 1,508 ఇళ్లు మంజూరైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పూర్తయినవి/చివరి దశకు చేరినవి 12,121 ఉన్నా యి. ఇక 2,912 నిర్మాణాలు మొదలుకాలేదు. మరో 506 ఇళ్లు మార్కవుట్, 805 బేస్‌మెంట్, 513 వాలింగ్, 1,469 స్లాబ్ దశలో ఉన్నాయి. ఇప్పటివరకు లబ్ధిదారులకు నిర్మాణ దశల ఆధారంగా రూ.507.86 కోట్ల బిల్లు చెల్లించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తక్కువ ధరకు సిమెంట్ అందించనుంది. ఇందుకోసం లబ్ధిదారులు ముందుగా నగదు చెల్లించే అవసరం లేదు. నిర్మాణ దశల ఆధారంగా అందే బిల్లులో సిమెంట్ ధర మినహాయిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తక్కువ ధరకు సిమెంట్ అందిస్తుండడం వల్ల లబ్ధిదారులకు ప్రయోజనంగా ఉంటుంది.
– భూక్యా శ్రీనివాస్,
గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్


