కూసుమంచి: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున యాసంగిలో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. మండలంలోని తురకగూడెంలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నందున వరి, మొక్కజొన్న సాగు చేసి నష్టపోవద్దన్నారు. ఈమేరకు రైతులు పెసర, మినుము, వేరుశనగ వంటి పంటలను సాగు చేయాలని తెలిపారు. ఏడీఏ సతీష్, ఉద్యానవన శాఖ అధికారి అపర్ణ, ఏఓ వాణి, సర్పంచ్ బుర్రా కృష్ణ పాల్గొన్నారు.


