ఖమ్మం సహకారనగర్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ఈమేరకు అర్హులు 21వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో ఫారాలు సమర్పించని అర్హులు, ఏఎస్‌డీ జాబితాలో పేర్లు చేరిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాబితాలో పేరు ఉండి అదే చిరునామాలో నివసిస్తున్నవారు ఎన్యుమరేషన్ ఫారంతోపాటు అనుబంధం పత్రం సమర్పించాలని, మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్నవారు కొత్త చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని తెలిపారు. అయితే, ఇప్పటికే ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నవారు ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
13న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్
ఖమ్మం సహకారనగర్: పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) ఖాతాల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13న కలెక్టరేట్‌లో అదాలత్, వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపా రు. ఉదయం 10–30నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న పెన్షన్, జీపీఎఫ్ కేసుల పరిష్కారంతోపాటు ఏసీ బిల్లులు, పెండింగ్ వోచర్లు, ట్రెజరీ తనిఖీ అభ్యంతరాలు, చెల్లించిన చెక్కుల వివరాలను అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. అలాగే, ఉద్యోగులు పెన్షన్ ప్రతిపాదనలను సకాలంలో సమర్పించే విధానంపై అవగా హన కల్పించి, అర్హులైన పెన్షనర్లకు పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు (పీపీఓలు), జీపీఎఫ్ చందాదారులకు లేఖలు పంపిణీ చేస్తారని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


