జాతీయ పురావస్తు శాఖ నిపుణుడు
వసంత్ షిండే
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేయాలని జాతీయ పురావస్తు శాఖ నిపుణుడు వసంత్ షిండే సూచించారు. బౌద్ధక్షేత్రం, బైరాగిగుట్ట తదితర పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల క్రితం తవ్వకాలు జరిపిన ప్రదేశాలను శనివారం ఆయన పరిశీలించారు. అక్కడ బయటపడిన వస్తువులపై పురావస్తు శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం షిండే మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో క్షేత్రాన్ని పరిశీలించానని, స్తూపం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమరావతి, విజయవాడ, మధిర, నాగులవంచ మీదుగా వాణిజ్య మార్గంగా ఒక నగరం ఉన్నట్లు ప్రస్తుత ఆధారాలతో తెలుస్తోందని చెప్పారు. బౌద్ధస్తూపం అభివృద్ధిలో స్థానికులను భాగస్వాములను చేయాలని, త్వరలోనే క్షేత్రం పెద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్‌రావు, డిప్యూటీ, అసిస్టెంట్ డైరెక్టర్లు పి.నాగరాజు, గంగాదేవి, మల్లు నాయక్, వేదకుమార్, తహసీల్దార్ పి.రాంప్రసాద్‌తో పాటు కే.వై.రామచందర్‌రావు, దుడ్డెల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


