సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో 34 వేల ఎకరాలకుపైగా పంటలకు నష్టం వాటిల్లినా సీఎం రేవంత్‌రెడ్డి నుంచి కనీస స్పందన కరువైందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం వారు మాట్లాడుతూ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు ఉన్నా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సోయి ఉంటే తీవ్ర విపత్తుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఆపద సమయంలో పంట నష్టాన్ని పరిశీలించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపిన వారు... ప్రభుత్వం కూడా స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రూ.10 లక్షల పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలకు కూడా మంత్రులు హెలికాప్టర్లు వాడుతున్నారని, ఆ వ్యయాన్ని రైతుల పరిహారానికి ఉపయోగించాలని సూచించారు. అలాగే, సీసీఐ కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో వరి, పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, బెల్లం వేణుగోపాల్, డోకుపర్తి సుబ్బారావు, లింగనబోయిన సతీష్, బలుసు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,
మాజీ ఎమ్మెల్యే సండ్ర


