ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, బియ్యం కృత్రిమ కొరత సృష్టించినా, ధరలు పెంచినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర టీ.ఎస్. స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన బియ్యం ధరల నియంత్రణ, సరఫరాపై వివిధ శాఖల అధికారులు, మిల్లర్లు, వ్యాపారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత ధరలకు బియ్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికా రులు పర్యవేక్షించాలన్నారు. ప్రతీ షాప్ వద్ద బీపీటీ, కేఎన్‌ఎం రకం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకం కిలో రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రకం బియ్యం కిలో రూ.79కు విక్రయించేలా బోర్డులు ఏర్పాటు చేయించాలని తెలిపారు. మిల్లర్ల నుంచి రిటైల్ వ్యాపారుల వరకు ఇదే ధరలు అమలయ్యేలా తనిఖీలు చేపట్టాలని చెప్పారు. పౌర సరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం మల్లికార్జునబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం వద్ద భద్రత
ఈవీఎం గోదాం పటిష్ట నిఘాతో భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోడౌన్ వద్ద నిఘా పెంచి, భద్రతా లోపాలు రాకుండా చూడాలని తెలిపారు. ఎన్నికల విభాగం ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


