యథేచ్ఛగా ఆర్‌డీ, జీరో దందా | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా ఆర్‌డీ, జీరో దందా

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

● విజిలెన్స్‌ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న వ్యాపారుల ● రైతుల పేరిట అమ్మకాలు, లైసెన్స్‌ లేకుండానే కొందరి వ్యాపారం ● కొరడా ఝులిపించేందుకు సిద్ధమవుతున్న మార్కెటింగ్‌ శాఖ

● విజిలెన్స్‌ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న వ్యాపారుల ● రైతుల పేరిట అమ్మకాలు, లైసెన్స్‌ లేకుండానే కొందరి వ్యాపారం ● కొరడా ఝులిపించేందుకు సిద్ధమవుతున్న మార్కెటింగ్‌ శాఖ

ఖమ్మంవ్యవసాయం: పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో పన్ను ఎగ్గొట్టేలా వ్యాపారులు అనుసరిస్తున్న ఆర్‌డీ, జీరో ఎత్తులపై ప్రభుత్వం సీరియస్‌ గా ఉంది. ఖమ్మం మార్కెట్‌లో ఆర్‌డీకి చెక్‌ పెట్టడంతో మొదలైన వ్యవహారం రాష్ట్రవ్యాప్త విజిలెన్స్‌ తనిఖీలకు దారి తీసింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే అంశాలు బయటపడినట్లు సమాచారం. ఈనేపథ్యాన మార్కెటింగ్‌ శాఖ వరంగల్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మావతి రెండు రోజులుగా ఖమ్మంలో మకాం వేసి తనిఖీలు సాగిస్తున్నారు. కోల్డ్‌ స్టోరేజీల్లో అక్రమాలు, లైసెన్స్‌ లేని వ్యాపారాలు, అనుమతులు లేకుండా మిర్చి వంటి పంటల రవాణా వంటివి తనిఖీల్లో బయటపడగా, డీడీ ఇచ్చే నివేదిక ఆధారంగా కొందరు అధికారులు, కార్యదర్శులపైనా చర్యలు తీసుకునే అవకాశముందని తెలిసింది.

ధర.. పన్నుల్లో వ్యత్యాసం

పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో అక్రమాలకు తావు ఇవ్వకుండా ప్రభుత్వం వేస్తున్న ఎత్తులకు వ్యాపారులు పైఎత్తులు వేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర కాకుండా తక్కువగా చూపించి పన్ను ఎగవేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఒక శాతం పన్నుతో పాటు పంటను బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 4 – 5శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ధర తక్కువగా నమోదు చేసి రేట్‌ డిఫరెన్స్‌(ఆర్‌డీ)తో పన్ను చెల్లిస్తున్నారు. ఇంకొందరు జీరో వ్యాపారం చేస్తూ పూర్తిగా ఎగవేస్తున్నారు. ఆర్‌డీ విధానానికి చెక్‌ పెట్టేందుకు ఖమ్మం మార్కెట్‌ అధికారులు కఠినంగా వ్యవహరించారు. దీంతో వ్యాపారులు ఆగస్టు రెండో వారంలో ఒకరోజు మిర్చి కొనుగోళ్లను నిలిపివేయగా.. ప్రభుత్వం ఆగ్రహించి రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లలో తనిఖీ చేయించింది.

బయటపడిన అక్రమాలు

ఖమ్మం, వైరా, మధిర, మద్దులపల్లి మార్కెట్ల పరిధి కోల్డ్‌ స్టోరేజీల్లో మిర్చి క్రయవిక్రయాల్లో ఆర్‌డీఓ, జీరో వ్యవహారాలు బయటపడ్డాయి. ఈక్రమాన వ్యాపారులు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన రైతుల పంటలను కొనుగోలు చేసి, వారి పేరిటే బయటకు తరలించి విక్రయించడం మొదలుపెట్టారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారులతో పాటు పలు మార్కెట్ల కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. కాగా, వ్యాపారుల అక్రమాల్లో కొందరు ఉద్యోగుల ప్రమే యం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యాన ఆర్‌డీ, జీరో అంశాలపై విజిలెన్స్‌ బృందాల పనితీరు పరిశీలనకు మార్కెటింగ్‌ శాఖ వరంగల్‌ రీజియన్‌ డీడీ పద్మావతి రెండు రోజులుగా ఖమ్మంలో మకాం వేశారు. పలు మార్కెట్ల పరిధి కోల్డ్‌ స్టోరేజీలు, చెక్‌ పోస్టులతో పాటు ఖమ్మం మార్కెట్లో క్రయవిక్రయాలను పరిశీలించిన ఆమె పలుచోట్ల అక్రమాలను గుర్తించారని సమాచారం. ఓ కోల్డ్‌ స్టోరేజీ నుంచి అనుమతి లేకుండా లారీలో మిర్చి తరలిస్తున్నట్లు గుర్తించిన డీడీ, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా వైరా వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో తొమ్మిది మంది, మధిర మార్కెట్‌ కమిటీ పరిధిలో 13 మంది వ్యాపారులు లైసెన్స్‌ లేకుండా క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారని సమాచారం. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే వైరా, మధిర మార్కెట్లలో లైసెన్సు లేకుండా వ్యాపారాలు చేసే వారిని గుర్తించగా, చెక్‌ పోస్టులపైనా నిగా వేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement