● ప్రవళిక మృతికి నిరసనగా బస్సులు బంద్ ● రీజియన్ వ్యాప్తంగా కార్మికుల ఆందోళనలు ● ప్రభుత్వ హామీతో మధ్యాహ్నం తర్వాత విధుల్లోకి సిబ్బంది..
ఖమ్మం మయూరిసెంటర్/మణుగూరు టౌన్: కండక్టర్ ప్రవళికకు కుటుంబీకులు, సహచర కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద గత నెల 25న మణుగూరు డిపో బస్సులో నుంచి ప్రయాణికురాలు తోసేయడంతో ప్రవళిక బస్సు టైర్ల కింద పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు బుధవారం రీజియన్‌లో బంద్ నిర్వహించారు. కండక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం డిపోల వద్ద కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
నిలిచిపోయిన బస్సులు
రీజియన్‌లోని డిపోల వద్ద ఆర్‌టీసీ కార్మికులు, సంఘాల నాయకులు కార్మిక జేఏసీ ఆధ్వర్యాన నల్ల బ్యాడ్జీలు ధరించి వర్షంలోనూ ఆందోళన చేపట్టారు. దీంతో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు రీజియన్ వ్యాప్తంగా 515 సర్వీసులకు గాను 37 సర్వీసులు(7శాతం) మాత్రమే నడిచాయి. ఖమ్మం డిపోలో 139 సర్వీసులకు 18, మధిరలో 52 సర్వీసులకు 8, సత్తుపల్లిలో 99 సర్వీసులకు గాను మూడు, భద్రాచలంలో 74 సర్వీసులకు గాను ఒక్క బస్సే నడిచింది. కొత్తగూడెంలో 59, సర్వీసులకు గాను 5, ఇల్లందులో 32 సర్వీసులకు గాను 2 మాత్రమే నడిచాయి. ప్రవళిక విధులు నిర్వర్తించే మణుగూరులో 60 సర్వీసుల్లో ఒక్కటి కూడా నడవలేదు.
ప్రభుత్వ హామీతో...
కార్మికులు నిరసనలతో బస్సులు నిలిచిపోగా, ప్రభుత్వం ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఆమె కుటుంబానికి కుటుంబానికి ఉద్యో గం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకు నుంచి రూ.కోటి ప్రమాద బీమా కూడా అందుతుందని వెల్లడించారు. ఈమేరకు స్పష్టమైన ప్రకటన వెలువడటంతో కార్మికులు మధ్యాహ్నం తర్వాత సమ్మెను విరమించి విధుల్లో చేరగా బస్సులు రోడ్డెక్కాయి.
ప్రయాణికులకు వెల్‌కమ్ చెప్పి..
గతంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు స్వాగతం చెబుతూ సిబ్బందితో వీడియోలు చేయించి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అప్పుడు ప్రవళిక సురక్షితంగా గమ్యాన్ని చేరేందుకు ఎల్ల ప్పుడూ ఆర్టీసిలోనే ప్రయాణించండంటూ చేసిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. బస్సులోకి ప్రయాణికులకు వెల్‌కం చెప్పిన బంగారు తల్లి.. ఇక సెలవంటూ వెళ్లిపోయిందంటూ ఆర్టీసీ కార్మికులు నివాళులర్పించారు. కాగా, ఆమె మృతదేహాన్ని బుధవారం రాత్రి మణుగూరు డిపో వద్దకు తీసుకురాగా, తోటి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నివాళులర్పించారు. తల్లి విజయలక్ష్మి, మహిళా కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాళులర్పించారు.
కండక్టర్ మృతిపై హత్య కేసు
అశ్వాపురం: ఆర్టీసీ కండక్టర్ గుండు ప్రవళిక(28) మృతిపై బుధవారం పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈనెల 25న బస్సు ప్రమాదంపై ప్రయాణికురాలు, మండల పరిధిలోని పిచుకలపాడుతండా గ్రామానికి చెందిన మౌనికపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కండక్టర్ మృతి చెందడంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎల్లయ్య తెలిపారు.


