పెనుబల్లి: ట్రాక్టర్ల పుల్వీల్స్ను ఎత్తుకెళ్తున్న ముఠా ను అరెస్ట్ చేసినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ సరవయ్య తెలిపారు. వీఎంబంజర్, వేంసూరు పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు రూ. 6.50 లక్షల విలువైన పుల్వీల్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్ల డించారు. వీఎం బంజర్ స్టేషన్ బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎస్ఐ షాకీర్, సిబ్బంది టి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమల్లు, జి.శ్రీనివాస్‌తో కలిసి వాహనా తనిఖీ చేస్తుండగా ముత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జి వద్ద రెండు బొలెరో వాహనాల్లో ట్రాక్టర్ పుల్ వీల్స్‌ను తీసుకెళ్తున్న ఐదుగురిని గుర్తించారు. వీరి ఆరా తీయగా చక్రాలను చోరీ చేసినట్లు బయటపడింది. ఈమేరకు సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు చెందిన పంతంగి చెన్నకేశవ, కుంట రాఘవేంద్ర, మేకల గోవర్దన్, పుచ్చి ముత్తయ్య, గోపిన నవీన్ పట్టుబడగా, ఎస్,కే.మస్తాన్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. నిందితులను సత్తుపల్లి కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సీఐ నరసయ్య, వీఎం బంజర్, వేంసూరు ఎస్ఐలు షాకీర్, పల్లెల ప్రదీప్ ను సీపీ సునీల్‌దత్, ఏసీపీ వసుంధర యాదవ్ అభినందించారు.


