ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు దేశాభివృద్ధికి ఆటకంగా నిలుస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు విమర్శించారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా కార్పొరేట్ వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్న ట్రంప్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి, దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆరో పించారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే కాక న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై అణచివేతకు పాల్పడుతోందని పేర్కొన్నారు. అంతేకాక ‘సర్’ పేరుతో దేశంలో 13 కోట్ల మంది, తెలంగాణలో 70 లక్షల మంది ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారని తెలి పారు. కాగా, పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ మద్దతు ఇస్తున్న అభ్యర్థిని గెలిపించుకోవాలని, నల్ల గొండలో జరిగే రైతు మహాసభలకు జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య కేసులో కాంగ్రెస్ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై రాజీలేని పోరాటం చేస్తామని పోతినేని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నందున రైతులు, వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి పద్మ, బండి రమేష్, కల్యాణం వెంకటేశ్వరరావు వై.విక్రమ్, మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, మడుపల్లి గోపాల్రావు, మెరుగు సత్యనారాయణ, ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం నేతలు పోతినేని, నాగేశ్వరరావు


