దమ్మపేట: గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులతోపాటు గంజాయిని కలిగి ఉన్న మరో ఇద్దరిని పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం... దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై బి.రాజేష్ కుమార్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్లపెంట గ్రామ శివారులోని శ్మశాన వాటిక వద్ద గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరపగా లంకాలపల్లి కి చెందిన పొట్ట సాయికుమార్, నాగుపల్లికి చెందిన లావుడ్యా చైతన్య వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వారిని కూడా అరెస్ట్ చేసి, 250 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.12,500లు ఉంటుందని సీఐ తెలిపారు. ఆదివారం కేసు నమోదు చేసి, గంజాయి సేవించిన ఆరుగురిని, గంజాయితో పట్టుబడిన ఇద్దరిని దమ్మపేట కోర్టులో హాజరు పరిచారు. గంజాయి సేవించిన ఆరుగురిని డీ అడిక్షన్ సెంటర్‌కు, గంజాయి కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు.


