వివాదం లేకుండా పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

వివాదం లేకుండా పరిష్కారం

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

● జిల్లాలో ‘మీడియేషన్‌ ఫర్‌ ది నేషన్‌’ ప్రత్యేక డ్రైవ్‌ ● ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు నిర్వహణ అవకాశాన్ని వినియోగించుకోవాలి విబేధాల తొలగింపు, అవగాహన

● జిల్లాలో ‘మీడియేషన్‌ ఫర్‌ ది నేషన్‌’ ప్రత్యేక డ్రైవ్‌ ● ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు నిర్వహణ

ప్రజలకు సులభంగా, ఉచితంగా, స్నేహపూర్వక వాతావరణంలో న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రత్యేక డ్రైవ్‌ను విజయవంతం చేయడానికి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు సహకరించాలి. వివాదాలు లేకుండా కేసుల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.

– ఎం.నాగరాజు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి

న్యాయం అంటే తీర్పుతో వివాదాన్ని ముగించడం మాత్రమే కాదు. ఇరుపక్షాల విభేదాలను తొలగించి, పరస్పర అవగాహనతో శాశ్వత పరిష్కారం కల్పించడం కూడా. మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులు సమస్యలపై స్వేచ్ఛగా చర్చించుకుని, పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వక పరిష్కారం పొందొచ్చు. ఇరుపక్షాల ప్రయోజనాలకు అనుగుణమైన పరిష్కారమే ప్రధాన లక్ష్యం.

– పి.దేవీమానస, కోఆర్డినేటర్‌, మీడియేషన్‌ సెంటర్‌

ఖమ్మంలీగల్‌: వాయిదాలకు తిరిగే బాధ లేదు.. కాలయాపన, ఖర్చులు అసలే ఉండవు.. ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన రీతిలో వివా దాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లాలో ’మీడియేషన్‌ ఫర్‌ ది నేషన్‌ 3.0’ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేసులు పేరుకుపోయిన నేపథ్యాన చిన్న కేసు తేలడానికి కూడా ఒక్కోసారి ఏళ్లు పడుతోంది. ఈ జాప్యాన్ని నివారించడానికి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గంలో భాగంగా మధ్యవర్తిత్వాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రత్యేక డ్రైవ్‌ డిసెంబర్‌ 31వరకు కొనసాగనుంది. జిల్లాలో మీడియేషన్‌ సెంటర్‌ 2016 సెప్టెంబర్‌ 7న మొదలుకాగా, పలు కేసులకు పరిష్కారం లభించింది.

మధ్యవర్తిత్వం అంటే..

ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం వచ్చినప్పుడు వారు కోర్టుకు వెళ్లకుండా తటస్థంగా ఉండే మూడో వ్యక్తి సాయంతో పరిష్కరించుకోవడమే మధ్యవర్తిత్వం. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఆర్బిట్రేషన్‌లో ఇద్దరూ తమ వాదనలు ఒక న్యాయ నిపుణుడి ముందు వినిపిస్తారు. ఆయన ఇచ్చే తీర్పు ఇద్దరికీ కట్టుబడి ఉంటుంది. మరొకటి మధ్యవర్తిత్వం. ఇందులో ఇద్దరి మధ్య రాజీ కుదిరేలా మాట్లాడతారు. ఇక్కడ తీర్పు ఇద్దరి ఇష్ట్రపకారమే ఉంటుంది.

సామరస్యంగా ముగింపు

కేసుల్లో గొడవ పెరగకుండా, సామరస్యంగా పరిష్కారం పొందేందుకు ఉద్దేశంతో ‘మీడియేషన్‌ యాక్ట్‌ –2023’ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మధ్యవర్తిత్వం(మీడియేషన్‌) అనేది కేవలం కోర్టుల్లో పెండింగ్‌ ఉన్న కేసులను తగ్గించే ప్రక్రియ మాత్రమే కాదు. వివాదాలను స్నేహపూర్వకంగా, సమర్థవంతంగా పరిష్కరించుకునే గొప్ప వేదికగా నిలుస్తోందని చెబుతున్నారు.

ఎలా నివేదిస్తారు..

మధ్యవర్తిత్వానికి కేసులు బదలాయించాలంటే సెక్షన్‌ 89 ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం ఏదైనా వివాదంలో పరిష్కారానికి తగిన అంశం ఉందో సంబంధిత న్యాయమూర్తి తన విచక్షణ ద్వారా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి నివేదించవచ్చు. ఆపై కక్షిదారులు, వారి న్యాయవాదులు మధ్యవర్తిత్వాన్ని కోరుకునే స్వేచ్ఛ ఉంది. అలా కోరుకున్న పక్షంలో ఆ వివాదాన్ని పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపుతారు.

ఏయే కేసులకు అవకాశం..

సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ వల్ల జరిగే సమయం, డబ్బు వృథాను నివారించడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మధ్యవర్తిత్వం ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా కుటుంబ తగాదా కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు, మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌లు, భూ తగాదాలు, పరిష్కరించదగిన క్రిమినల్‌ (కాంపౌండబుల్‌) కేసులను ఇరువర్గాల మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా కాపాడుకుంటూనే సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా త్వరగా ప్రతిస్పందన లభించనుండగా, ఖర్చులు ఉండకపోగా సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement