ఎర్రుపాలెం: రానున్న యాసంగిలో జిల్లా రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య కోరారు. ఎర్రకుపాలెం మండలం రాజుపాలెంలో శుక్రవారం ఏర్పాటుచేసిన రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున అధికంగా నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న కాకుండా పెసర, మినుము, వేరు శనగ, నువ్వుల తదితర ఆరుతడి పంటలు, చిరుధాన్యాలు, కూరగాయలే సాగు చేయాలని సూచించారు. భూగర్భ జలమట్టాలు తగ్గే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, విత్తనోత్పత్తి మొక్కజొన్న సాగు చేసే రైతులు వ్యవసాయ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇవ్వడంతో పాటు గ్రామాలకు వచ్చే దళారుల వద్ద కాకుండా డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. తొలుత మీనవోలు, బనిగండ్లపాడు, ఎర్రుపాలెం, రాజుపాలెం గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన డీఏఓ రికార్డుల నిర్వహణ, ఎరువుల అమ్మకంపై డీలర్లకు సూచనలు చేశారు. ఏఓ బోయినపల్లి సాయిశివ, ఏఈఓ కూరెళ్ల వంశీకృష్ణసాయి పాల్గొన్నారు.


