బస్సుల్లో కయ్యాలు | - | Sakshi
Sakshi News home page

బస్సుల్లో కయ్యాలు

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

డిపోల వారీగా పల్లెవెలుగు,

ఎక్స్‌ప్రెస్‌ బస్సుల వివరాలు

చిల్లర విషయంలో..

‘మహాలక్ష్మి’తో ఆర్‌టీసీ బస్సుల కిటకిట

ఫలితంగా డ్రైవర్లు, కండక్టర్లకు తిప్పలు

తాజాగా ప్రయాణికురాలు తోసేయడంతో కండక్టర్‌కు తీవ్రగాయాలు

ఇరువర్గాల సమన్వయంపై అధికారులు దృష్టి సారిస్తేనే మేలు

ఖమ్మం మయూరిసెంటర్‌: ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రద్దీ అసాధారణంగా పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 2లక్షల మంది ప్రయాణికులు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆర్టీసీకి ఆదాయం వస్తున్నా... కండక్టర్లు, డ్రైవర్లకు మాత్రం ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. బస్సు సామర్థ్యానికి మించి 100 – 150 మంది వరకు ఎక్కుతుండడం టికెట్లు జారీ చేయడం, ప్రయాణికులను నియంత్రించడం కత్తి మీద సాములా మారుతోంది. కొన్నిసార్లు అటు సిబ్బంది, ఇటు ప్రయాణికులు సంయమనం పాటించకపోవడంతో వాగ్వాదాలు ఘర్షణలకు దారి తీస్తున్నాయి.

పెరిగిన పనిభారం

మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగడమే కాక కొందరు సహనం కోల్పోయి వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. బస్సులో 55 మందికి మించి తీసుకొళ్లద్దని రవాణా శాఖ నిబంధనలు చెబుతున్నాయి. కానీ కొన్ని రూట్లలో 100 – 150 మంది వరకు ప్రయాణిస్తున్నారు. పలు రూట్లలో రద్దీకి తగ్గట్టు బస్సులు లేక, సామర్థ్యానికి మించి ఎక్కుతుండడంతో టికెట్ల జారీ, హాల్టింగ్‌ కోసం ప్రయాణ సమయం పెరిగి.. రోజుకు 15 గంటలకు పైగానే విధులు నిర్వర్తిస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు. అయినా కొందరు ప్రయాణికులు చిన్న అంశాలకే గొడవ పడుతుండడం, తాజా ఘటనలో కండక్టర్‌ ప్రాణాల మీదకు రావడం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. ఇటీవల ఖమ్మం బస్టాండ్‌లో ఓ కండక్టర్‌పై ప్రయాణికురాలి బంధువులు దాడి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, మహిళా ప్రయాణికుల విషయంలో ఉచితంగా వెళ్తున్నారనే భావనతో కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు కూడా విమర్శలకు తావిస్తోంది.

చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

దాడులను అరికట్టడానికి యాజమాన్యం, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. మణుగూరు డిపో కండక్టర్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ రీజియన్‌ వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద సోమవారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈమేరకు యాజమాన్యం, అధికారులు స్పందించి అటు ప్రయాణికులు, ఇటు సిబ్బంది నడుమ సమన్వయం పెరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి.

రోజుకు 2లక్షల మందికి పైగా..

ఖమ్మం రీజియన్‌ ఏడు డిపోల పరిధిలో పల్లెవెలుగు బస్సుల ద్వారా రోజుకు 95 వేల మంది ప్రయాణిస్తున్నారు. అలాగే, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సుమారు 1.16లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మొత్తంగా 2.10లక్షల మందికి పైగా ప్రయాణికుల రాకపోకలతో బస్సుల్లో రద్దీ ఉంటోంది.

డిపో పల్లెవెలుగు ఎక్స్‌ప్రెస్‌

ఖమ్మం 58 46

మధిర 17 38

సత్తుపల్లి 42 34

భద్రాచలం 19 31

కొత్తగూడెం 30 24

మణుగూరు 20 36

ఇల్లెందు 16 14

మొత్తం 202 223

మణుగూరు డిపో బస్సులో ఆదివారం జరిగిన ఘటన ఆర్టీసీ సిబ్బంది భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది. పల్లె వెలుగు బస్సులో ఓ మహిళ తన కుమారుడి టికెట్‌ కోసం రూ.100 ఇవ్వగా, మిగతా నగదు దిగేటప్పుడు తిరిగి ఇస్తానని కండక్టర్‌ ప్రవళిక టికెట్‌ వెనుక రాయడంతో గొడవ మొదలైంది. అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్దకు వచ్చేసరికి వివాదం ముదిరి, కండక్టర్‌ను సదరు మహిళ కిందకు నెట్టేసింది. దీంతో కింద పడగా బస్సు వెనుక టైర్లు కాళ్ల పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రవళికకు చికిత్స కొనసాగుతుండగా, ప్రమాదానికి కారణమైన మహిళను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement