ఖమ్మం రాపర్తినగర్: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వచ్చేనెల నవంబర్ 5వ తేదీన జిల్లాస్థాయి యువజనోత్సవం నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే యువజనోత్సవంలో భాగంగా జానపద నృత్యం, జానపదగేయాలు, పోస్టర్ల తయారీ, వీధి నాటికలు, కవిత్యం అంశాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ప్రథమ స్థానాన నిలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈమేరకు 15 – 29 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు నవంబర్ 4వ తేదీలోపు ఎంట్రీలను dyfkmm2026@ gmail. com మెయిల్‌కు లేదా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని తమ కార్యాలయంలో నేరుగా కానీ అందజేయాలని, వివరాలకు 99482 07271 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నేడు ‘నిధి ఆప్‌కే నికట్’
ఖమ్మం సహకారనగర్: ఉద్యోగులు, సంస్థల యజమానులు, పెన్షనర్లకు సంబంధించి ఈపీఎఫ్‌ఓ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మంగళవారం ‘నిధి ఆప్‌కే నికట్’ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ వై.డీ.శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉదయం 9–30నుంచి సాయంత్రం 4గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ సేవలు, కొత్తగా చేరిన సంస్థల యజమానులకు సేవల వివరాలు, పెన్షనర్ల జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణతో పాటు పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈమేరకు ఉద్యోగులు, సంస్థ యజమానులు, పెన్షనర్లు హాజరుకావాలని కోరారు.
మక్కలకు మహర్దశ
క్వింటాకు రూ.2,600 రికార్డు ధర
ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్నకు డిమాండ్ అమాంతం పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మొక్కజొన్న క్వింటాకు గరిష్టంగా రూ.2,600 రికార్డు ధర పలికింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) రూ.2,400గా ప్రకటిస్తే, మార్కెట్‌లో అంతకు మించి నమోదైంది. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో దేశవ్యాప్తంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. అయితే, పారిశ్రామిక, పౌల్ట్రీ రంగాల్లో మొక్కజొన్న అవసరం పెరగడంతో డిమాండ్ ధర నమోదవుతోందని భావిస్తున్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత శుక్రవారం రూ.2,970 రికార్డు ధర పలకగా, ఖమ్మంలో తొలిసారి రూ.2,600గా నమోదైంది. ప్రస్తుత వానాకాలం జిల్లాలో కేవలం 560 ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న సాగైంది.
78మంది కండక్టర్ల సర్వీసు క్రమబద్ధీకరణ
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్‌టీసీ ఖమ్మం రీజియన్‌లో బ్రెడ్ విన్నర్ స్కీమ్, మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ స్కీమ్ ద్వారా కన్సాలిడేటెడ్ పేపై నియమితులైన కండక్టర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 12వ తేదీ నుంచి వర్తించనున్నాయని పేర్కొన్నారు. రీజియన్‌లోని వివిధ డిపోల్లో పనిచేస్తున్న 78 మంది కండక్టర్ల సర్వీసు క్రమబద్ధీకరించగా, వీరిని వేతన స్కేల్‌లోకి మారుర్చి నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్ల డించారు. ఏడాది పాటు ప్రొబేషనరీ అమల్లో ఉండనుండగా, క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
శిథిల భవనాలపై
ఉన్నతాధికారులకు నివేదిక
సత్తుపల్లి: సత్తుపల్లిలోని శ్రీబండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని శిథిల భవనాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కె.రవిబాబు తెలిపారు. కళాశాలను సోమవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. 1970లో నిర్మించిన గదులు శిథిలావస్థకు చేరినందున తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. అనంతరం బోధనపై అధ్యాపకులకు సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ గుడిపాటి లక్ష్మయ్య, అధ్యాపకులు నర్సింహారావు, జహీర్, అయూబ్, రవి, లింగమూర్తి పాల్గొన్నారు.


