ఎమ్మెల్సీగా సర్వోత్తమ్‌రెడ్డి
గెలుపునకు ఇప్పటినుంచే కృషి
ఎల్‌నినోపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గడువులోగా నాణ్యతతో పూర్తిచేయాలి
ఖమ్మంరూరల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యతా ఓట్లతో గెలిపించేలా పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే కృషి చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈమేరకు పార్టీ నాయకులు ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికపై సోమవారం నిర్వహించిన పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. మండలికి మంచి అభ్యర్థిని పంపితేనే ఫలితం ఉంటుందని తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నందున, నవంబర్ 6వరకు పార్టీ శ్రేణులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ అత్యధికంగా ఓటర్లను నమోదు చేయించాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నందున పట్టభద్రులను ఓటర్లగా నమోదు చేయించి కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి బాటలు వేయాలని సూచించారు. అలాగే, ‘సర్’కు నిరసనగా ఢిల్లీలో జరిగే ధర్నాకు తరలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఎల్‌నినోపై ప్రతిపక్షాల దుష్ప్రచారం
ప్రపంచంలో వందకు పైగా దేశాలు ఎల్‌నినో ప్రభావంతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుండగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఈమేరకు ప్రతిపక్షాల కుట్రలపై మౌనంగా ఉండకుండా వారి విమర్శలను తిప్పికొట్టాలని, ఎల్‌నినోపై ప్రజలను కాంగ్రెస్ కార్యకర్తలు జాగృతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత, నాయకులు స్వర్ణకుమారి, నాగేశ్వరరావు, గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నరేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలేరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతను పర్యవేక్షిస్తూనే గడువులోగా పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలోనిక్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్., అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పురోగతి, భూసేకరణ సమస్యలపై చర్చించి సూచనలు చేశారు. అభివృద్ధి పనుల్లో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం జరిగేలా భూమికి బదులు భూమి, ఇంటికి బదులు ఇల్లు ఇచ్చేలా వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, ఎల్‌నినో నేపథ్యాన నీటి పొదుపు, పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. జల వనరుల శాఖ సీఈ వాసంతి, జల వనరుల శాఖ, ఆర్‌అండ్‌బీ, పీఆర్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు ఎం.వెంకటేశ్వర్లు, యుగంధర్‌రావు, వెంకట్‌రెడ్డి, ఇనుగుర్తి శ్రీనివాసాచారి, శేఖర్‌రెడ్డి, మెడికల్ ఈఈ ఉమామహేశ్వరరావు, డీఏఓ డి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


