కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మంసహకారనగర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. వాతావరణ శాఖ బులెటిన్ ప్రకారం ఈనెల 27న జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు, 28న పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే, 29వ తేదీన ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 – 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనే సూచనల మేరకు రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉరుములు, మెరుపుల సమయాన ప్రజలు బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపాన ఉండొద్దని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
జీళ్లచెరువు ఆలయానికి మహర్దశ
అభివృద్ధికి టీటీడీ నుంచి రూ.1.47 కోట్లు
ఖమ్మంగాంధీచౌక్: కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ అభివృద్ధి పనులకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నుంచి రూ.1.47 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీటీడీ జేఈఓ ప్రతిపాదన, బోర్డు తీర్మానం ఆధారంగా పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈమేరకు త్వరలోనే ఈ–టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టనున్నారు.
ఎల్‌నినోను తట్టుకునేలా ప్రజల్లో చెతన్యం
నేటి నుంచి అధికారుల గ్రామాల బాట
నేలకొండపల్లి: ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఎదురుకావడంతో పాటు ఇతర సమస్యలు రానున్నందున ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఏర్పడిన కమిటీలు సోమవారం నుంచి గ్రామాల బాట పట్టనున్నాయి. మండల స్థాయి అధికారులు సమన్వయంతో గ్రామసభలు నిర్వహించి నీటి కొరత, ఉన్న వనరులను పొదుపుగా ఉపయోగించడం, వరి కాకుండా ఆరుతడి పంటలే సాగు చేసేలా స్థానికులకు అవగాహన కల్పిస్తారు. అంతేకాక అర్హులు వీబీజీ రాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా పనుల గుర్తింపు చేపడుతారు.
జిల్లా రైతులకు అవార్డులు
వేంసూరు/ఖమ్మం వ్యవసాయం: గోవాలో మూడు రోజుల పాటు జరిగిన 9వ ఏషియన్ పీజీపీఆర్ అంతర్జాతీయ మహాసభల్లో జిల్లా రైతులకు అవార్డులు దక్కాయి. జిల్లా నుంచి వేంసూరు మండలం కందుకూరుకు చెందిన ఆదర్శ రైతు గొర్ల సత్యనారాయణరెడ్డి, ఖమ్మంకు చెందిన అగ్రి–హార్టికల్చర్ సొసైటీ సలహాదారు నల్లమల వెంకటేశ్వరరావుతో పాటు కుడముల వెంకటరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సభల్లో దేశ, విదేశాల నుంచి 462 మంది శాస్త్రవేత్తలు, రైతు ప్రతినిధులు పాల్గొనగా నేల నిస్సారం కాకుండా రసాయన ఎరువులు తగ్గించి, రైజో బాక్టీరియా ఆధారిత బయో ఫెర్టిలైజర్లను అభివృద్ధి చేయాలని తీర్మానించా రు. ఇక ఆదివారం జరిగిన ముగింపు సభలో సత్యనారాయణరెడ్డికి ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవా ర్డు, వెంకటేశ్వరరావుకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఏసియన్ పీజీపీఆర్ సొసైటీ చైర్మన్ ఎం.ఎస్.రెడ్డి అందజేసి సన్మానించారు.
శబరి యాత్రకు సిద్ధం
భద్రాచలం: అపారమైన భక్తితో శ్రీరాముడికి ఎంగిలి పండ్లను సమర్పించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందిన భక్త శబరి స్మృత్యర్థం సోమవారం భద్రాచలంలో శబరి స్మృతి యాత్ర నిర్వహించనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో గిరిజన భక్తులకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 2013 నుంచి ఏటా అశ్వయుజ మాస పౌర్ణమి సందర్భంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో పునరుద్ధరణ పనుల దృష్ట్యా గిరిప్రదక్షిణ రద్దు చేశారు. ఆ స్థానంలో ప్రచార రథంపై స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శోభాయాత్ర, ఆతర్వాత శ్రీరామ సేవా మండపంలో నిత్యకల్యాణోత్సవం నిర్వహిస్తారు. గిరిజన భక్తులను యాత్రకు తీసుకొచ్చేలా ఇల్లెందు, అశ్వారావుపేట, జూలూరుపాడు, వాజేడు, కూనవరం మార్గాల్లో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల ద్వారా అధికారులు ఆదివారం వెళ్లారు.


