● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● రూ.38 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మంరూరల్: రాష్ట్రంలోని ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు రూ.38 కోట్లతో చేపట్టే నాలుగు లేన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.కోటి వ్యయంతో పూర్తయిన నాయుడుపేట జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రూ.38 కోట్లతో చేపడుతున్న నాలుగు లేన్ల రహదారి నిర్మాణం పూర్తయితే ఏదులాపురం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయ ని తెలిపారు. మద్దులపల్లి నుంచి గొల్లగూడెం వరకు నిర్మించే రహదారిని త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మున్సిపాలిటీకి ప్రభుత్వం ఇప్పటికే రూ.75.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయా న ఇచ్చిన హామీ మేరకు ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా రహదారులు, డ్రెయినేజీలు, జంక్షన్ల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలో గిరిజన భవన్, వసతి గృహం, రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు గడువులోగా నాణ్య తతో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఏదులాపురం మున్సిపాలిటీ అవృవృద్ధికి ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు. ఖమ్మం ఆర్‌డీఓ ఎన్.శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


