జిల్లాలో ఇప్పటివరకు 91.49శాతం పూర్తి
ఖమ్మంవ్యవసాయం: రెవెన్యూ సర్వే నంబర్ల ఆధారంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు మూడో వారంలో ప్రారంభమైన పంట డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) జిల్లాలో చివరి దశకు చేరింది. వానా కాలం సీజన్‌లో సాగు చేసిన పంటలతో పాటు, సాగులో ఉన్న ఇతర పంటలను సర్వే చేస్తున్నారు. ఈనెల 24వ తేదీ నాటికి 91.49 శాతం సర్వే పూర్తయిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
వలంటీర్ల ద్వారా క్షేత్రస్థాయి సర్వే
క్షేత్రస్థాయిలో పంటల వివరాలు నమోదు చేసేందుకు రెవెన్యూ గ్రామాల ఆధారంగా ప్రభుత్వం వలంటీర్లను నియమించింది. ఒక్కో ప్లాట్‌కు రూ.7 చొప్పున చెల్లించేలా వీరిని ఎంపిక చేశారు. వలంటీర్లు పొలానికి వెళ్లి ఏ పంట, ఎప్పుడు, ఎంత విస్తీర్ణంలో వేశారు, పంట పరిస్థితి ఎలా ఉందో ఫొటో తీసి యాప్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియను వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ) పర్యవేక్షిస్తూ ఆన్‌లైన్ చేస్తారు. పంట సాగు చేసిన రైతులకు విక్రయ సమయంలో ఇబ్బంది రాకుండా మద్దతు ధర అందించడం. సాగు చేసిన, చేయని భూముల వివరాలను గుర్తించేందుకు ఈ సర్వే చేపడుతున్నారు. పంటల బీమా, రైతు భరోసా, రుణాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం అందించేందుకు ఈ వివరాలు ప్రామాణికం కానున్నాయి. సర్వేలో రైతుల పంట వివరాలు నమోదు కాకపోతే అమ్ముకునే సమయాన మద్దతు ధర కోల్పోయే ప్రమాదం ఎదురవుతుంది.
కల్లూరులో అత్యధికం
జిల్లాలోని 21 మండలాల పరిధి 378 గ్రామాల్లో 7,60,664 ప్లాట్లకు గాను 6,95,942 ప్లాట్లలో ఇప్పటివరకు సర్వే పూర్తయింది. మండలాల వారీగా కల్లూరు 99.73 శాతం అగ్రభాగాన ఉంది. ఈ మండలంలో 58,222 ప్లాట్లకు 58,064 ప్లాట్లలో సర్వే చేశారు. ఇక ఎర్రుపాలెం 99.64శాతం, ఖమ్మం రూరల్ 96.25శాతం, చింతకాని మండలం 95.01 శాతంతో ముందు నిలిచాయి. సత్తుపల్లి మండలంలో 77.50శాతం, వైరాలో 78.64శాతమే పూర్తయింది. గడువులోగా 100 శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉండగా, సర్వేకు వచ్చే వలంటీర్ల వద్ద రైతులు పంట వివరాలు నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య కోరారు.


