● జిల్లాలో రూ.18కోట్ల విలువైన పెండింగ్ చలాన్లు ● ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తే రంగంలోకి..
ఖమ్మం క్రైం: మితిమీరిన వేగం, సిగ్నళ్ల దగ్గర ఆగకుండా దూసుకెళ్లడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించని వారితో పాటు రాంగ్‌సైడ్‌లో వెళ్లిన వారిపై ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సందర్భంగా జరిమానా విధిస్తున్నారు. అంతేకాక డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడడం, డ్రంకెన్ డ్రైవ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించిన చలాన్లు భారీగా పేరుకుపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటించేలా చూడాలని ఇటీవల కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యాన జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు, కేసుల సమాచారాన్ని అధికారులు బయటకు తీస్తున్నారు.
3లక్షలకు పైగానే..
జిల్లాలో 2024నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 3లక్షలకు పైగా నిబంధనల ఉల్లంఘనల కేసులు నమోదైనట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆయా కేసుల్లో రూ.18కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఓసారి ప్రభుత్వ ఆదేశాలతో రిబేటు ఇవ్వగా పలువురు చెల్లించారు. ఆ తర్వాత అటు అధికారులు, ఇటు వాహనదారులు పట్టించుకోకపోవడంతో జరిమానాలు పేరుకుపోయాయి.
లింక్ పెడితేనే...
చలాన్లు చెల్లించని వాహనదారుల నుంచి వసూళ్లకు రాష్ట్ర రవాణా శాఖ కరెంట్ బిల్లు లేదా బ్యాంక్ ఖాతాకు ముడి పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రతీనెల వచ్చే కరెంట్ బిల్లుకు రోడ్డు ఉల్లంఘనల కింద వాహనదారుడు చెల్లించాల్సిన చలాన్‌ను జత చేస్తే ఫలితం ఉంటుందనే భావనకు వచ్చినట్లు సమాచారం. లేదంటే బ్యాంక్ ఖాతాకు లింక్ పెట్టి చలానా విధించగానే ఖాతా నుంచి నగదు రవాణా శాఖకు జమ అయ్యేలా చూడాలనే మరో ఆలోచన ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ నుంచి స్పష్టత వస్తే పెండింగ్ చలాన్ల వసూళ్లకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు.


