కల్లూరురూరల్/వేంసూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కల్లూరులో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే వైపు వెళ్తుండగా జీడీపీ పల్లి గ్రామంలో రోడ్డువెంట రైతు, కూలీలు ధాన్యం కాంటా వేస్తున్నారు. దీంతో కాన్వాయ్ ఆపిన మంత్రి వారితో మాట్లాడారు. ధాన్యం దిగుబడి ఎంత వచ్చింది, ఏ ధరకు అమ్ముతున్నారని ఆరా తీశారు. పచ్చి ధాన్యాన్ని అమ్ముతున్నామని రైతులు చెప్పగా, ప్రభుత్వ కేంద్రాలకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అయితే, ప్రైవేట్ వ్యాపారులు పచ్చి ధాన్యానికి మంచి ధర ఇస్తున్నారని రైతులు నరసింహారావు, సీతారాములు, వెంకటేశ్వర్లు వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావడంతో వరి పండించగలిగామని చెప్పిన రైతులు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే, వేంసూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవ మృతిచెందిన వారి కుటుంబా లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
రైతులను ఆరా తీసిన మంత్రి తుమ్మల


