ఇద్దరు ఉపాధ్యాయులు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉపాధ్యాయులు తప్పనిసరి

Oct 23 2026 12:15 AM | Updated on Oct 23 2026 12:15 AM

● ప్రతీ ప్రాథమిక పాఠశాలలో నియమించాల్సిందే.. ● 50మంది విద్యార్థులు దాటితే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ● నర్సరీ, కేజీ తరగతులతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి ● జీఓ 25లో సవరణకు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

ఇదీ డిమాండ్‌..

● ప్రతీ ప్రాథమిక పాఠశాలలో నియమించాల్సిందే.. ● 50మంది విద్యార్థులు దాటితే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ● నర్సరీ, కేజీ తరగతులతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి ● జీఓ 25లో సవరణకు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

ఖమ్మం సహకారనగర్‌: ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ జీఓ 25ను సవరించాల్సిందేననే సూచనలు వస్తున్నాయి. ఈ మేరకు పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి సూచనలు చేయడంతో పాటు విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా జీఓలోని వివరాలు, ఉపాధ్యాయులు కోరుతున్న సవరణలపై కథనం.

నిబంధనలిలా...

పాఠశాల విద్యాశాఖ గతంలో జారీ చేసిన జీఓ 25 ప్రకారం 0 – 19 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు, 20 – 60 మంది విద్యార్థులైతే ఇద్దరు, 61 – 90 మందికి ముగ్గురు, 91 – 120 మందికి నలుగురు, 121 – 150 మందికి ఐదుగురు ఉపాధ్యాయులు, 151 – 200 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధానోపాధ్యాయుడిని కేటాయించేలా నిబంధనలు పొందుపరిచారు. అయితే, 20మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఇద్దరు, 60 మంది ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులే ఉండాలన్న నిబంధన సమంజసం కాదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరగాల్సిందేనని సూచిస్తున్నారు.

తరగతికి ఒక ఉపాధ్యాయుడు

ప్రాథమిక పాఠశాలల్లో 1 – 5వ తరగతి వరకు విద్యార్థులకు అనేక సబ్జెక్టులను బోధించాల్సి ఉండడం, వర్క్‌బుక్స్‌ను కూడా ఉపాధ్యాయులే పూర్తి చేయించాల్సి ఉంటుంది. ఈనేపథ్యాన ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందించడం అసాధ్యమనేది ఉపాధ్యాయ వర్గం వాదన. ఈక్రమాన ప్రతీ ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని, 50 మంది విద్యార్థులు దాటితే ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలనే డిమాండ్‌ వస్తోంది. ఉపాధ్యాయుల కొరత విద్యా ప్రమాణాలపై పడి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపిస్తున్నారని చెబుతున్నారు.

నర్సరీ, కేజీ తరగతులు ప్రవేశపెట్టాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతీ ప్రాథమిక పాఠశాలకు అనుసంధానంగా నర్సరీ, కేజీ తరగతులను ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ చాన్నాళ్లుగా ఉంది. ఆయా తరగతులకు కూడా ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు అవసరమైన వసతులను కల్పించాలనే సూచనలు వస్తున్నాయి. ప్రతీ గ్రామపంచాయతీలో ఒక ప్రాథమిక పాఠశాలను మోడల్‌గా అభివృద్ధి చేసి, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించడం, నర్సరీ, కేజీ తరగతులను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు సౌకర్యాలను కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచొచ్చనే అభిప్రాయం వ్యకమవుతోంది.

అనుసంధానం

చిన్న గ్రామాలు, ఆవాసాల్లో బడి ఈడు పిల్లల సంఖ్య తక్కువగా ఉండి.. అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరినా ఆ సంఖ్య 20 మంది లోపు ఉంటుంది. అలాంటి పాఠశాలలను విద్యార్థుల సంఖ్య, దూరం, రవాణా సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని సమీపంలోని మోడల్‌ పాఠశాలలకు అనుసంధానం చేయొచ్చు. అయితే, విద్యార్థులు మోడల్‌ పాఠశాలలకు చేరేలా ప్రభుత్వమే రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే డిమాండ్‌ ఉంది.

నిష్పత్తిని సవరించాలి

ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ – విద్యార్థి నిష్పత్తిని ప్రభుత్వం సవరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను కేటాయిస్తేనే అందరిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టి నాణ్యమైన బోధన అందించడం సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయులు కోరుతున్న నూతన నిష్పత్తి ప్రకారం 1 – 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, 11 – 25 మందికి ఇద్దరు, 26 – 35 మందికి ముగ్గురు, 36 – 50 మందికి నలుగురు ఉపాధ్యాయులను కేటాయించాలి. అలాగే, 51 – 90 మందికి ఐదుగురు, 91 – 120 మందికి ఆరుగురు, 121 – 150 మందికి ఏడుగురు, 151 – 180 మందికి ఎనిమిది మంది, 181 – 200 మంది విద్యార్థులకు తొమ్మిది మంది ఉపాధ్యాయులను కేటాయించాలని వినతులు వస్తున్నాయి. ఈ నిష్పత్తిని అమలు చేస్తే తరగతి గదుల్లో విద్యార్థులపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ పెరిగి, బోధన–అభ్యసన ప్రక్రియ మరింత మెరుగుపడుతుందనే అభిప్రాయం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement