15గంటల పాటు ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

15గంటల పాటు ఇక్కట్లు

Oct 23 2026 12:15 AM | Updated on Oct 23 2026 12:15 AM

వైరారూరల్‌: వైరా మండలం స్టేజీ పినపాక సమీపాన వైరా నది హైలెవల్‌ వంతెనపై సుబాబుల్‌ లోడ్‌తో ఉన్న ఒక లారీ బ్రేక్‌డౌన్‌ అయి నిలిచిపోయింది. దీంతో సుమారు 15 గంటల పాటు జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వంతెన మధ్యలో లారీ నిలిచిపోవడం.. వంతెనకు ఒక వైపు నుండి రెండు మార్గాల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. భద్రాచలం నుంచి సుబాబుల్‌ లోడ్‌తో ఓ లారీ మహారాష్ట్రకు బయలుదేరింది. మార్గమధ్యలో స్టేజీ పినపాక సమీపాన వంతెన మధ్యలోకి రాగానే బ్రేక్‌డౌన్‌ అయి నిలిచిపోయింది. అంతేకాక లారీలోని సుబాబుల్‌ కర్రలు ఓ పక్కకు ఒరిగాయి. బుధవారం రాత్రి 9గంటల సమయంలో ఈ ఘటన జరగగా వైరా ఎస్సై పుష్పాల రామారావు, సిబ్బందితో చేరుకుని వాహనాల ఒకే మార్గంలో రాకపోకలు సాగించేలా పర్యవేక్షించారు. దసరా సెలవుల అనంతరం జనం కార్లు ఇతర వాహనాలతో వెళ్తుండడం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రహదారే కీలకం కావడంతో రెండు వైపులా వాహనాలు బారులు దీరాయి. గురువారం ఉదయం వరకు ఇదే పరిస్థితి కొనసాగగా.. ఎస్సై రామారావు భారీ క్రేన్‌ తెప్పించి బ్రేక్‌డౌన్‌ అయిన లారీని పక్కకు తీయిస్తూనే కొన్ని వాహనాలను స్టేజీపినపాక, కేజీ సిరిపురం, స్నానాల లక్ష్మీపురం మీదుగా వైరాకు, వైరా నుండి వెళ్లే వాహనాలను అదే గ్రామాల మీదుగా తల్లాడ ఇతర ప్రాంతాలకు మళ్లించారు. దీంతో 15గంటల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు రాకపోకలు సాఫీగా మొదలయ్యాయి.

లారీ బ్రిడ్జిపై ఆగిపోవడంతో

ట్రాఫిక్‌ అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement