● ఐదు నెలల్లో రూ.54.51 కోట్ల వసూలుకు ప్రణాళిక ● ప్రస్తుతం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న కేఎంసీ ● వేతనాలు, బిల్లుల చెల్లింపుపై ప్రభావం పడకుండా ప్రత్యేక దృష్టి
ఖమ్మంమయూరిసెంటర్: నిధుల లేమితో ఖమ్మం నగర పాలక సంస్థ(కేఎంసీ) తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఖజానా ఖాళీ కావడంతో కార్మికుల వేతనాల చెల్లింపులు, చిన్నపాటి అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు భారంగా మారాయి. ఇన్నాళ్లు చేయూత దరఖాస్తుల పరిశీలన, ఎస్‌ఐఆర్ పనుల్లో వార్డు ఆఫీసర్లు, బిల్లు కలెక్టర్లు నిమగ్నం కావడంతో ఆస్తి పన్నుల వసూళ్లు మందగించి ఆదాయంపై ప్రభావం పడింది. మరోపక్క ప్రభుత్వం నుంచి సైతం నిధులు రాక ఇబ్బంది ఎదురవుతుండగా మళ్లీ ఖజానా నింపేలా అధికారులు దృష్టి సారించారు.
కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ముగియడంతో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పూర్తిగా ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ఈమేరకు రెవెన్యూ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో పాటు వార్డు ఆఫీసర్లకు పన్ను వసూళ్లపై లక్ష్యాలు నిర్దేశించారు. ప్రతీరోజు ఒక్కో వార్డు ఆఫీసర్ కనీసం 10 – 15 మంది పన్ను చెల్లింపుదారులను నేరుగా కలిసి బకాయి వసూలు చేయాలని ఆదేశించారు.
ఐదు నెలల్లో రూ.54.51 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్నుల ద్వారా దాదాపు 80వేల అసెస్‌మెంట్ల నుంచి రూ.70.39 కోట్ల ఆదాయం వస్తుందని కేఎంసీ అంచనా వేసింది. కానీ ఏడు నెలలు గడుస్తున్నా కేవలం 23,741 అసెస్‌మెంట్లకు సంబంధించి రూ.15.88 కోట్లే వసూలయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఐదు నెలలే ఉన్నందున రూ.54.51 కోట్ల మేర పన్నులు రాబట్టేలా అధికారులు ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు.


