ఖమ్మం లీగల్: ఓ మహిళను దూషించి చంపుతామని బెదిరించిన కేసులో ముగ్గురికి మూడు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఏపూరి బంధుప్రియ గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం గొల్లగూడెంకు చెందిన అమరబోయిన మంగమ్మ తన పొలంలో 2018 ఆగస్టు 21న దున్నిస్తుండగా కుర్రి ముత్తమ్మ, కుర్రి నాగమణి, కొర్రి రామారావుతో పాటు మరొకరు ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. ఆమెను దూషిస్తూ దాడి చేయగా ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈక్రమాన విచారణ చేపట్టిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నిందితులపై నేరం రుజువు కాగా, ఒకటో నిందితుడు మృతి చెందడంతో ముగ్గురికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు.
అపార్ట్‌మెంట్‌లో బైక్ చోరీ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం గొల్లగూడెం ప్రాంతంలో దొంగలు హల్‌చల్ చేశారు. స్థానిక మైత్రి అపార్ట్‌మెంట్‌లోకి బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయాన చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ఓ బైక్ ఎత్తుకెళ్లారు. అలాగే, శృంగేరి పీఠం ఎదురుగా చెరువుకు వెళ్లే రహదారిలోని ఓ ఇంటి వద్ద స్టీల్ నల్లాలు పగులగొట్టి దొంగతనం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని వాట్సప్ గ్రూప్‌ల్లో పోస్ట్ చేశారు. అనుమానిత వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


