అన్నివర్గాల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అన్నివర్గాల సంక్షేమానికి కృషి

Oct 20 2026 1:44 AM | Updated on Oct 20 2026 1:44 AM

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మంరూరల్‌: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి టీఎన్జీవోస్‌ కాలనీలో రూ.2.50 కోట్లతో నిర్మించే గిరిజన సంక్షేమ శాఖ బాలుర పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ భవన నిర్మాణానికి కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.తో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ త్వరలోనే బాలికల హాస్టల్‌ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. పథకాలు అర్హులకు అందేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో ముప్పుతో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి కోరారు. ఇప్పటికే రైతులు సాగుచేసిన పంటలకు నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే, రాబోయే రోజుల్లో సాగునీరు, విద్యుత్‌ కొరత కూడా వచ్చే అవకాశమున్నందున యాసంగిలో వరి, మొక్కజొన్న వంటి నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలు కాకుండా ఆరుతడి పంటలు సాగుచేయాలని సూచించారు. ఈవిషయంలో రైతులు, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పోకబత్తిని అనిత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement