రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంఅర్బన్/రఘునాథపాలెం: ఖమ్మం వెలుగుమట్లలో పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే కాక అన్ని వసతులతో మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాలనీ నిర్మాణ పనులను సోమవారం పరిశీలించిన ఆయన కలెక్టర్ దివాకర్ టీ.ఎస్, సీపీ సునీల్‌దత్, కమిషనర్ అభిషేక్ అగ్యస్త్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాలనీలో పనులు వేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైయిన్ల పనులు నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కాగా, గతంలో పేదల పేరుతో కొందరు స్థలాలను ఆక్రమించడమే కాక నకిలీ ధ్రువపత్రాలతో నిరుపేదలను మోసం చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కోర్టు ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లు కేటాయించామని తెలిపారు.
తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత
వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి చెరువును పరిశీలించిన ఆయన మాట్లాడారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ జలాలను విడుదల చేసి ఈర్లపూడి చెరువు నింపినట్లు తెలిపారు. ఎండల తీవ్రత మరింత పెరగనుండడంతో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, యాసంగిలో వరి, మొక్కజొన్న కాకుండా తక్కువ నీరు అవసరమయ్యే పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. సుడా, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్‌బాబా, విద్యుత్‌శాఖ డీఈ రామారావుతో పాటు నాయకులు రాయల నాగేశ్వరరావు, యరగర్ల హన్మంతరావు, మానుకొండ రాధాకిషోర్, నాగండ్ల దీపక్‌చౌదరి, సాధు రమేష్‌రెడ్డి, తుపాకుల యలగొండస్వామి, కొంటెముక్కల నాగేశ్వరరావు, లకావత్ సైదులు, దేవ్‌సింగ్, బోయినపల్లిలక్ష్మణ్, బాషా తదితరులు పాల్గొన్నారు.


