ఖమ్మంక్రైం: మతిస్థిమితం లేని మహిళను చేరదీసిన అన్నం ఫౌండేషన్ బాధ్యులు ఆమె కుటుంబాన్ని గుర్తించి అప్పగించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈనెల 12వ తేదీన మతిస్థిమితం లేని మహిళను గుర్తించగా, అన్నం ఫౌండేషన్ చైర్మన్, రెడ్‌క్రాస్ సభ్యుడు అన్నం శ్రీనివాసరావు చేరదీసి తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. ఆమెకు వైద్యం చేయిస్తూ వివరాలు ఆరా తీయడంతో నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఎలమకంటి లక్ష్మిగా వెల్లడించింది. దీంతో శ్రీనివాసరావు ఆమె ఫొటో, వివరాలను నకిరేకల్ పోలీసులకు పంపించారు. అక్కడి పోలీసులు లక్ష్మి కుటుంబసభ్యులను గుర్తించి విషయం చెప్పారు. దీంతో వారు సోమవారం రాగా ఖమ్మం వన్‌టౌన్ సీఐ సమక్షాన లక్ష్మిని అప్పగించారు. ఈక్రమాన కుటుంబ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలపగా ఆయనను సీఐ సన్మానించారు.


