జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికి
224 కేసులు
పట్టణాలను దాటి
గ్రామాలకు చేరిన మోసాలు
విస్తృత స్థాయిలో అవగాహన
కల్పించకపోతే కష్టమే..
సైబర్ నేరస్తులు రోజుకో రూపంలో తమ పంజా విసురుతున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల పేరుతో నకిలీ మెసేజ్‌లు, లింక్‌లు పంపడం, షేర్ మార్కెట్, క్రిప్టో, ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించడం, డిజిటల్ అరెస్టుతో పాటు హ్యాకింగ్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇటీవలే మ్యూల్ ఖాతాల గుట్టురట్టయింది. ఆన్‌లైన్ గేమ్స్, మోసాలతో వచ్చిన రూ.కోట్లలో సొమ్మును కమీషన్లకు ఆశపడిన కొందరు మ్యూల్ ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. మరోపక్క సైబర్ వలలో చిక్కుకొని డబ్బు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండగా.. భారీ మొత్తంలో స్వాహా అవుతున్న నగదును రికవరీ చేయడం సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ)కు సవాల్‌గా మారింది.
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 224 సైబర్ నేరాలు నమోదు కాగా.. ఘటనల్లో బాధితులు ఏకంగా రూ.3,10,47,604.50 కోల్పోయారు. అంటే సగటున ఒక్కో కేసులో రూ.లక్షకు పైగా పోగొట్టుకున్నారు. ఇందులో పలువురు ఇచ్చిన ఫిర్యాదుతో రూ.45,13,422ను పీఓహెచ్(పుట్ ఆన్ హోల్డ్) చేయగలిగారు. కొన్ని కేసులు పరిష్కరించగా ఇప్పటి వరకు బాధితులకు తిరిగి వచ్చిన సొమ్ము రూ.7,81,957 మాత్రమే. స్వాహా చేస్తున్న వారు నగదును దేశ, విదేశాల్లోని ఖాతాల్లోకి మళ్లిస్తుండడంతో కేసుల ఛేదన సైబర్ విభాగానికి సవాల్‌గా మారగా.... తమ డబ్బులు ఎప్పుడు వస్తాయోనని బాధితులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.
సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయిన వారు ఎంత త్వరగా 1930కు ఫిర్యాదు చేస్తేనే నగదు జమ అయిన ఖాతాలను హోల్డ్ చేసే అవకాశముంది. ఆలస్యం జరిగే కొద్దీ నేరగాళ్లు సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ చేసినా, ఏటీఎంల ద్వారా డ్రా చేసుకున్నా పెద్దగా ఫలితం ఉండదు. అయితే, సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవడం, మోసానికి గురైతే చేయాల్సిన పనులను ఇన్నాళ్లు పట్టణ ప్రాంతాల్లోనే అవగాహన కల్పిస్తున్నారు. కానీ బాధితులు గ్రామాల్లోనూ ఉంటున్నందున పోలీసులు, బ్యాంకుకు సమాచారం ఇవ్వాలనే విషయమై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముంది. విస్తృతంగా సదస్సులు నిర్వహించడంతో పాటు పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తే ప్రజలు మోసపోకుండా కట్టడి చేసే అవకాశం ఏర్పడుతుంది.
బోనకల్ మండలం పెద్దబీరవల్లికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఒకరి ఫోన్‌కు గత నెల 27న మధ్యాహ్నం ఓటీపీ వచ్చింది. అదేమిటోనని ఆలోచిస్తుండగానే బ్యాంకు ఖాతా నుంచి నగదు కట్ అవుతున్నట్లు మరో మెస్సేజ్ పంపారు. ఆ తర్వాత బ్యాలెన్స్ చూసుకోగా రూ.99,998 తక్కువగా ఉండడంతో 1930 కాల్ చేయడమే కాక బోనకల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా అవగాహన ఉన్న వాళ్లు వెంటనే ఫిర్యాదు చేస్తున్నా.. అవగాహన లేని వారు ఆరా తీస్తుండగానే నిందితులు ఇంకో ఖాతాలోకి సొమ్ము బదలాయించి దొరకకుండా తప్పించుకుంటున్నారు.
సైబర్ నేరాల్లో
అతి తక్కువగా రికవరీ


