దంపతులకు ఒకేసారి డాక్టరేట్‌! | - | Sakshi
Sakshi News home page

దంపతులకు ఒకేసారి డాక్టరేట్‌!

Sep 9 2026 12:53 AM | Updated on Sep 9 2026 12:53 AM

ఉద్యోగాలు చేస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పరిశోధన

రఘునాథపాలెం: తాజాగా జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి దంపతులు డాక్టర్‌ బి.సృజన్‌లాల్‌, డాక్టర్‌ జి.మోనికాజాదవ్‌ డాక్టరేట్లు అందుకుని ప్రత్యేక చాటారు. వీరిద్దరు కూడా మేనేజ్‌మెంట్‌ విభాగంలో పరిశోధన పూర్తిచేయడం మరో విశేషం. ప్రస్తుతం సృజన్‌లాల్‌ ఎస్‌బీఐలో, మోనిక ఎస్పీడీసీఎల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ పక్క ఉద్యోగాలు చేస్తూనే ఉన్నత విద్యపై ఆసక్తితో పీహెచ్‌డీ పూర్తి చేసిన వీరిద్దరు డాక్టరేట్‌ అందుకున్నారు. కాగా, సృజన్‌లాల్‌ తల్లిదండ్రులు బి.సుందర్‌లాల్‌, శైలజ ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు కావడంతో అదే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు.

తొలిరోజు ప్రశాంతంగా టెట్‌

ఖమ్మం సహకారనగర్‌: సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న టీచర్స్‌ ఎలిజబులిటీ టెస్టు(టెట్‌) మంగళవారం మొదలైంది. రెండో రోజుల పాటు పరీక్షలు జరగనుండగా, నిర్వహిస్తుండగా, మొదటిరోజు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు(సీబీటీ) నిర్వహించారు. ఈమేరకు రెండు సెషన్లలో దరఖాస్తు చేసుకున్న 2,292మంది ఉపాధ్యాయులకు గాను 1,956మంది హాజరయ్యారని డీఈఓ సదానందం తెలిపారు. ఉదయం సెషన్‌లో 759మందికి 545మంది, మధ్యాహ్నం పరీక్షకు 1,533మందిలో 1,411మంది హాజరయ్యారని వెల్లడించారు.

మూడు జిల్లాల

మత్స్యకారులకు శిక్షణ

కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇచ్చే శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు వరంగల్‌ జిల్లాకు చెందిన మత్స్యకారులు, మత్స్య రైతులు హాజరయ్యారు. తొలిరోజు బయోప్లాక్‌ విధానంలో చేపల పెంపకంపై ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘాల చీఫ్‌ ప్రమోటర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడారు. మత్స్యకారులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకాన్ని వృద్ధి చేయాలని, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌తో పాటు శాస్త్రవేత్తలు రవీందర్‌, దివ్య పలు అంశాలపై అవగాహన కల్పించారు.

జీజీహెచ్‌లో 32మంది వైద్యులకు షోకాజ్‌ నోటీసులు

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది వైద్యులకు మెడికల్‌ సూపరింటెండెంట్‌ నరేందర్‌ మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఓపీ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు గాను పలువురు అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ రెసిడెంట్లకు ఈ నోటీసులు ఇచ్చారు. పెద్దాస్పత్రిలోని కొందరు వైద్యులు ఇలా వచ్చి, అలా వెళ్తూ గంట కూడా ఓపీ వద్ద సమయం వెచ్చించకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు రక్తపరీక్షల నివేదికలు తీసుకుని వచ్చేసరికి వైద్యులు ఉండకపోవడంతో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సూపరింటెండెంట్‌ పలువురికి నోటీసులు జారీ చేయగా, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈఎన్‌టీ విభాగంలో ఆరుగురు, డెర్మటాలజీలో ఐదుగురు, జనరల్‌ మెడిసిన్‌, గైనిక్‌లో నలుగురు చొప్పున, ఆప్తమాలజీలో ముగ్గురు, జనరల్‌ సర్జరీ, పల్మనాలజీ, పీడియాట్రిక్‌, ఫిజియాలజీ విభాగాల్లో ఇద్దరు చొప్పునే కాక కార్డియాలజీ, ఆర్ధో విభాగాల్లో ఒక్కొక్కరికి నోటీసులు జారీ అయ్యాయి.

మధిర ఇంజనీరింగ్‌

కాలేజీకి ఓకే !

బాలానగర్‌: మధిరలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం లభించింది. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో మంగళవారం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ వీసీ టి.కిషన్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా మధిర నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించారు. ఈ నిర్ణయంతో మధిరలో ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే తాత్కాలికంగా తరగతుల నిర్వహణ భవనాలు, శాశ్వత భవనాల నిర్మాణానికి స్థల సేకరణపై దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement