45 రోజుల్లోనే చెక్‌డ్యామ్ నిర్మాణం
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం కట్టుకాచారం వద్ద రికార్డు సమయంలో చెక్‌డ్యామ్‌ను నిర్మించగా.. ఇప్పుడు అక్కడ నీరు చేరి అలుగుపోస్తుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. చెన్నారం గ్రామానికి 2023లో రూ.6.65 కోట్లతో చెక్‌డ్యామ్ మంజూరైంది. అయితే, కట్టుకాచారం ఏటిపై నిర్మిస్తే కట్టుకాచారాం, కొంగర గ్రామాలతో పాటు సూర్యాపేట జిల్లా కొత్తగూడెంలోని 250 ఎకరాలకు సాగునీరు అందనుండడంతో రైతుల వినతి మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ చూపారు. ఈ ఏడాది జూన్ 11న పనులు మొదలుపెట్టగా మంత్రి స్వయంగా మూడు సార్లు పరిశీలించారు. ఈమేరకు అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయంతో 143 మీటర్ల పొడవుతో చెక్‌డ్యామ్ నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తిచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెక్‌డ్యామ్ అలుగు పోస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాగునీటి అవసరాలు తీరడమే కాక సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు, స్థానికులు చెబుతున్నారు.


