● గోదావరి, సాగర్ జలాల వినియోగంలో అప్రమత్తత ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మంరూరల్/రఘునాథపాలెం: సాగర్, గోదావరి జలాలు ఎక్కడా వృథా కాకుండా పర్యవేక్షిస్తూ తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పల్లెగూడెంలోని ఎన్నెస్పీ కాల్వ లింక్ కెనాల్ పునరుద్ధరణ పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సాగర్ కాల్వ నుంచి ఏదులాపురం చెరువుకు నీటి సరఫరా జరిగే కాలువ, తూము పనులపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అధికారులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా కాలువ, తూము పునరుద్ధరణ పనులను పూర్తిచేసి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అలాగే, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలాల్లో ‘ఎస్‌ఐఆర్’ నోటీసుల జారీ, విచారణపై కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం ఆయన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం డీప్‌కట్ వద్ద జలాల పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం నీటి లభ్యత, కాల్వలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన సాగర్, గోదావరి జలాలను తాగునీటి అవసరాలకు వినియోగిస్తూ జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం అంతరాయం ఏర్పడకుండా కాలువలు, రెగ్యులేటర్లు, ఔట్‌లెట్లను నిరంతరం తనిఖీ చేయాలని తెలిపారు. నీటి పారుదల శాఖ సీఈ వాసంతి, ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్‌డీఓ శ్రీనివాస్, వైరా ఈఈ బాబురావు, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, సొసైటీ చైర్మన్ తాతా రఘురాం, తహసీల్దార్లు వినయేందర్‌రెడ్డి, అరుణ, శ్వేత, ఇరిగేషన్ ఏఈ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


