కూసుమంచి/తిరుమలాయపాలెం: వర్షాలు లేక పంటలు వడలిపోతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యాన సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు జల వనరుల శాఖ అధికారులు మంగళవారం భక్తరామదాసు ప్రాజెక్టు మోటార్‌ను ఆన్ చేసి నీరు విడుదల చేశారు. వారం పాటు నీరు విడుదల చేస్తూ, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని చెరువులు నింపుతామని ఇరిగేషన్ డీఈ బాణాల రమేష్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులోని ఒక మోటార్ ద్వారా 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మార్గమధ్యలో రైతులు మోటార్ల ద్వారా నీరు తోడినా, గండ్లు పెట్టినా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేలా చెరువులు నింపేందుకు విడుదల చేసిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, నీటి విడుదలతో ఇబ్బందులు తప్పనున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కూసుమంచి మండలం ఎర్రగడ్డతండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేయగా, తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం వద్ద కాల్వలోకి నీరు చేరింది. పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ జలాలు చేరుతుండటంతో నీటిమట్టం 21అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారు.
చెరువులు నింపేందుకు నీటి విడుదల


