ఖమ్మంగాంధీచౌక్: భక్తజన సందోహం నడుమ ఖమ్మంలో నృసింహుడి గిరి ప్రదక్షణ వైభవంగా సాగింది. స్వామి జన్మనక్షత్రం (స్వాతి నక్షత్రం) సందర్భంగా బుధవారం సాయంత్రం ఖమ్మంలోని స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నేత్రపర్వంగా నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంలో తీసుకొచ్చి గుట్ట చుట్టూ నగర పుర వీధుల్లో ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా భక్తుల నృసింహ నామ స్మరణతో మార్మోగింది. అనంతరం స్వామి వారిని తిరిగి ఆలయానికి చేర్చి రాతి కొండపై నక్షత్ర జ్యోతి వెలిగించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్చకులు, ఉద్యోగులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


