● నూరు శాతం డిజిటలైజేషన్‌కు కృషి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మం సహకారనగర్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్)లో అర్హులైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి వివిధ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ‘సర్’లో భాగంగా బీఎల్‌ఓలు ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే చేపట్టి, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాక ఆగస్టు 10న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ఆపై అభ్యంతరాలు స్వీకరించి పరీక్షించాక అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా విడుదలవుతుందని చెప్పారు. ఇప్పటివరకు 10,15,693 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేయగా, 81.66 శాతం పూర్తయిందని తెలిపారు. డిజిటలైజేషన్ 100 శాతం పూర్తయ్యేలా పార్టీ నాయకులు సహకరించాలని సూచించారు.
పర్యాటక అభివృద్ధిపై దృష్టి
పోడు పట్టాలపై విచారణ కమిషన్ ద్వారా క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లాలో అటవీ హక్కుల(ఆర్‌ఓఎఫ్‌ఆర్) పట్టాలు, పాలేరు సరస్సు, వైరా రిజర్వాయర్, పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై ఐటీడీఏ పీఓ రాహుల్, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్‌తో కలిసి సమీక్షించారు. అటవీ భూముల్లో కొత్త ఆక్రమణలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, జిల్లాకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ పర్యాటక అభివృద్ధి పనులను చేపట్టాలని చెప్పారు. బోనకల్ మండలంలోని పర్యాటక ప్రాజెక్టు స్థల సమస్యపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు. ఈసమావేశాల్లో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎస్‌డీసీ సదానందం, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, ఆర్‌డీఓ శ్రీనివాస్, ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, కల్లూరులో పర్యటన
సత్తుపల్లి/కల్లూరు రూరల్: కలెక్టర్ దివాకర సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో పర్యటించారు. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో భూసర్వేపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి తహసీల్‌లో సమీక్షించారు. సర్వేయర్లకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కల్లూరులో కార్యాలయ సముదాయం నిర్మాణంపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు.


