ఆర్టీసీలో అప్రెంటిస్‌ శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో అప్రెంటిస్‌ శిక్షణ

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం రీజియన్‌ పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో ఐటీఐ (ఫిట్టర్‌ ట్రేడ్‌ మినహా) పూర్తి చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్‌ఎం సరిరామ్‌ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www. apprenticeshipindia. org వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఎస్సెస్సీ, ఐటీఐ మెమో, కుల ధ్రువీకరణపత్రం, బ్యాంక్‌ పాస్‌బుక్‌ తదితర పత్రాలు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. దరఖాస్తు కోసం ఈనెల 31వరకు గడువు ఉందని ఆయన తెలిపారు.

రిజర్వాయర్‌కు నిలిచిన గోదావరి జలాలు

వైరా: సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా రిజర్వాయర్‌కు వస్తున్న గోదావరి జలాలను జలవనరుల శాఖ అధికారులు నిలిపివేశారు. గత 13 రోజులుగా రోజుకు 550 క్యూసెక్కుల చొప్పున సాగర్‌ ఎడమ కాల్వ పరిధి తిమ్మరావుపేట ఎస్‌కేప్‌ లాక్‌ల నుంచి రిజర్వాయర్‌లోకి నీరు చేరాయి. గోదావరి జలాలు రాక మునుపు 13.3 అడుగులు ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 16.3 అడుగులకు చేరడంతో గత రెండు రోజులుగా 250 క్యూసెక్కులకు తగ్గిస్తూ పూర్తిగా నిలిపేశారు. అయితే, ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ మాత్రం 17 అడుగులకు చేరేవరకు నీరు విడుదల చేయాలని అధికారులను కోరినా ప్రస్తుతం నీటిని ఎగువన ఖమ్మంకు తరలిస్తున్నారు. కాగా, రిజర్వాయర్‌లోని నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులు నిర్ణయించగా, ఆయకట్టు పరిధిలోని రైతులు ఇప్పటికే నారుమళ్లు పోసుకుని ఎదురుచూస్తున్నారు.

ప్రతీ విద్యార్థికి

పోషకాహారం

మధిర: ప్రభుత్వం సమకూరుస్తున్న పోషకాహారం ప్రతీ విద్యార్థికి చేరేలా పర్యవేక్షించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి రవిబాబు సూచించారు. మధిర ప్రభుత్వ జూనియర్‌ కాలేజీని బుధవారం తనిఖీ చేసిన యన ప్రిన్సిపాల్‌ జి.శంకర్‌, అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఈనెల 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజన పథకం అమలుకానున్నందున కావాల్సిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలాగే, డిజిటల్‌ బోధన, ప్రాక్టికల్‌ ల్యాబ్‌లు, తరగతులపై సూచనలు చేశారు. ఈ విద్యాసంవత్సరం 200మంది విద్యార్థులు చేరేలా కృషిచేసిన ప్రిన్సిపాల్‌, అధ్యాపకులను అభినందించారు.

ఎల్‌నినోకు

అనుగుణంగా సాగు

వైరా: రైతులు ఎల్‌నినో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తక్కువ నీటి వనరులు అవసరమయ్యే పంటలే సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. వైరా రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన..ఆరుతడి పంటల సాగు ఆవశ్యకత, నీటి కుంటల నిర్మాణంపై అవగాహన కల్పించారు. కాగా, వైరా రిజర్వాయర్‌ ఆయకట్టుకు సాగునీరందించాలని సర్పంచ్‌లు వినతిపత్రం అందజేశారు. ఎంపీడీఓ సక్రియా, ఏడీఏ కరుణశ్రీ, తహసీల్దార్‌ సురేష్‌, ఏఓ మయాన్‌ మంజుఖాన్‌ పాల్గొన్నారు.

మత్స్యకారులకు

శిక్షణ ప్రారంభం

కూసుమంచి: పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘జలాశయాల్లో చేపల పెంపకం – యాజమాన్య పద్ధతులు’ అంశంపై ఎస్సీ, ఎస్టీ మత్స్యకారులకు ఇచ్చే మూడు రోజుల శిక్షణ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ మాట్లాడుతూ మంచినీటి చేపలకు డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా ఉత్పత్తిపై దృష్టి సారించాలని తెలిపారు. ఇందుకోసం నూతన పద్ధతులను అవలంబించాలని చెప్పారు. శిక్షణ కార్యక్రమాలు, ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుంటే లాభముంటుందని తెలిపారు. శాస్త్రవేత్తలు రవీందర్‌, గణేష్‌, దివ్య వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement