దాహార్తి తీర్చేలా గోదావరి జలాలు | - | Sakshi
Sakshi News home page

దాహార్తి తీర్చేలా గోదావరి జలాలు

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

రాజీవ్‌ కాల్వ..

మంచుకొండ లిఫ్ట్‌తో భరోసా

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఖమ్మంఅర్బన్‌ / రఘునాథపాలెం: గోదావరి జలాలతో ఖమ్మం వాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తిమ్మరావుపేట ఎస్‌కేప్‌ లాక్‌ల నుంచి రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం ఎన్నెస్పీ డీప్‌ కట్‌ వద్దకు గోదావరి జలాలు చేరుతుండడంతో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.తో కలిసి బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి కొరత రాకుండా సీతారామ ప్రాజెక్ట్‌ అనుబంధం రాజీవ్‌ కాల్వ ద్వారా ఖమ్మం వైపు మళ్లించే ప్రయోగం కొనసాగుతోందని తెలిపారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపి నగరానికి తాగునీరు అందించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో నీటి కొరత మరింత తీవ్రరూపం దాల్చే అవకాశమున్నందున రైతులు వరి, మిర్చికి బదులు ఆయిల్‌పామ్‌, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేయాలని సూచించారు. కలెక్టర్‌ దివాకర టీఎస్‌ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ వచ్చే ఏడాది జూన్‌ వరకు ఖమ్మం నగర తాగునీటి అవసరాలు తీర్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అనంతరం మంత్రి ఖమ్మంలోని 3, 4, 5వ డివిజన్లలో రూ.1.75 కోట్ల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో అభివృద్ధి

గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి పూర్తయితే ఖమ్మం జిల్లా అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కలెక్టర్‌ దివాకర, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌తో కలిసి ధంసలాపురం వద్ద జాతీయ రహదారిపై రైల్వే ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) పనుల పురోగతిని మంత్రి పరిశీలించి మాట్లాడారు. హైవే ప్రణాళికలో ధంసలాపురం వద్ద ఎగ్జిట్‌ లేకపోయినా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడే కాక కల్లూరు, సత్తుపల్లి వద్ద మంజూరు చేయించామని తెలిపారు. వచ్చేనెల 1నుంచి హైవేపై రాకపోకలు ప్రారంభమైతే ఖమ్మం, వైరా, సత్తుపల్లి ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్‌ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందన్నారు. కాగా, అమరావతి నుంచి భద్రాచలం మీదుగా జగదల్‌పూర్‌ వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి ప్రతిపాదన ఉందని, మణుగూరు నుంచి ఏటూరునాగారం మీదుగా నాగపూర్‌ వెళ్లే జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ పి. శ్రీనివాసరెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ యుగంధర్‌ రావు, జాతీయ రహదారుల పీడీ దివ్య, జల వనరుల శాఖ సీఈలు మంగళపూడి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, డీపీఓ రాంబాబు, రాష్ట్ర గిడ్డంగులు, సుడా, మార్కెట్‌, ఆత్మ కమిటీల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్‌తో పాటు రావూరి సైదబాబు, నూతి సత్యనారాయణ గౌడ్‌, కేలోత్‌ దేవ్‌సింగ్‌, కొంటెముక్కల నాగేశ్వరరావు, యరగర్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement